విశాఖలో హత్య.. రాయగడలో మృతదేహం..! | - | Sakshi
Sakshi News home page

విశాఖలో హత్య.. రాయగడలో మృతదేహం..!

Jul 31 2026 1:51 AM | Updated on Jul 31 2026 1:51 AM

● 45 రోజుల తర్వాత సంచలన హత్య వెలుగులోకి ● సూట్‌కేసులో మృతదేహాన్ని కుక్కి రైలులో తరలింపు

కంచరపాలెం: ప్రేమ పేరుతో మైనర్‌(14)ను వంచించాడు. పెళ్లి చేసుకోవాలని అడిగినందుకు కిరాతంగా దాడి చేసి హతమార్చాడు. మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి విశాఖ నుంచి రైలులో ఒడిశాకు తరలించాడు. 45 రోజుల తర్వాత ఈ సంచలన హత్య వెలుగులోకి వచ్చింది. సాంకేతిక ఆధారాలతో ఒడిశా పోలీసులు విశాఖకు వచ్చి నిందితుడిని గురువారం అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఊర్వశీ జంక్షన్‌ గౌరీనగర్‌లో నివాసముంటున్న బి.సురేష్‌కుమార్‌ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్య ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లింది. ఈ సమయంలో రైల్వేస్టేషన్‌లో ఒక మైనర్‌తో పరిచయం పెంచుకున్నాడు. మూడు నెలలుగా ఆమెతో చనువుగా ఉంటూ ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడు. ఆమె పెళ్లి చేసుకోవాలని కోరడంతో ఆమెను హత్య చేయాలని పథకం రచించాడు.

సూట్‌కేసులో కుక్కి ఒడిశాకు.. : జూన్‌ 15న మైనర్‌పై దాడి చేసి హత్య చేశాడు. మృతదేహాన్ని మాయం చేయడానికి జగదాంబ జంక్షన్‌కు వెళ్లి సూట్‌కేస్‌ కొనుగోలు చేశాడు. ముందు ఒక గోనె సంచిలో కట్టి సూట్‌కేసులో కుక్కాడు. అదే రోజు రాయగడ ప్యాసింజర్‌ రైలులో ఒడిశాకు వెళ్లి, జేకేపూర్‌ సమీపంలోని చాందిలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గోనెసంచితో ఉన్న మృతదేహాన్ని పడేశాడు. మరుసటి రోజు ఉదయం ఖాళీ సూట్‌కేసుతో విశాఖకు తిరిగి వచ్చాడు. కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు లభించకపోవడంతో గుర్తుతెలియని మృతదేహంగా అంత్యక్రియలు నిర్వహించారు. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా అనుమానాస్పదంగా సూట్‌కేసుతో సంచరిస్తున్న సురేష్‌కుమార్‌ను గుర్తించారు. అనంతరం రాయగడ నుంచి విశాఖ వరకు రైల్వే స్టేషన్లలోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. సెల్‌ఫోన్‌ డేటా, ఇతర సాంకేతిక ఆధారాలతో ఒడిశా సీఐ ఉత్తమ్‌కుమార్‌ సాహు బృందం గురువారం విశాఖకు చేరుకుని, కంచరపాలెం పోలీసుల సహకారంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement