విశాఖపై కక్ష
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :
మాటల్లో అమృతం.. చేతల్లో వంచన అంటే ఇదే.. విశాఖను రాష్ట్రానికి ’ఆర్థిక రాజధాని’గా తీర్చిదిద్దుతామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ప్రభుత్వం, ఆచరణలో మాత్రం ఒక్కొక్క ఇటుకను ఊడబీకుతోంది. అభివృద్ధి అంటే కొత్త సంస్థలను తీసుకురావడం అని ప్రజలు భావిస్తే.. ఉన్న కార్యాలయాలను విజయవాడ వైపు తరలించడమే తమ మార్క్ పాలన అని కూటమి సర్కార్ నిరూపిస్తోంది. సీబీఐ కోర్టు, సెంట్రల్ జీఎస్టీ ఆడిట్ భవనం, ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయం.. ఇలా వరుసగా నగరాన్ని ఖాళీ చేయిస్తూ, ఇప్పుడు ‘ఏపీ మారిటైం బోర్డు’ను కూడా మంగళగిరికి మార్చింది. విశాఖ కేంద్రంగా బోర్డు పనిచేయాల్సిందిగా చట్టంలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఆ చట్టంలో ఎలాంటి సవరణలు చేయకుండా కార్యాలయాన్ని తరలించడం నగరవాసులను విస్మయానికి గురిచేస్తోంది.
చట్టం చుట్టమైందా?
సాధారణంగా ఏదైనా ప్రభుత్వ సంస్థ ప్రధాన కార్యాలయం మార్చాలంటే చట్ట సవరణ అవసరం. గత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019 నవంబర్‌లో ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా మారిటైం బోర్డు కేంద్రం విశాఖలోనే ఉంటుందని చట్టంలో స్పష్టంగా పేర్కొంది. దీని ప్రకారం విశాఖలోని హెచ్‌బీ కాలనీలో కార్యాలయం ఏర్పాటైంది. ఉత్తరాంధ్రలో కీలకమైన మూలపేట పోర్టు పనులను కూడా ఇక్కడి నుంచే పర్యవేక్షించారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం కనీసం చట్ట సవరణ కూడా చేయకుండా, నిబంధనలను బేఖాతరు చేస్తూ రాత్రికి రాత్రే బోర్డును మంగళగిరికి తరలించేసింది. చట్టం విశాఖ అని చెబుతున్నా.. పాలన మాత్రం మంగళగిరి నుంచే సాగిస్తామనడం పాలకుల ద్వంద్వ వైఖరికి నిదర్శనం.
వరుసగా తరలిపోతున్న కార్యాలయాలు
విశాఖ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే సెంట్రల్ జీఎస్టీ ఆడిట్ భవనాన్ని విజయవాడకు తరలించారు. విశాఖకు రావాల్సిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయాన్ని ఒత్తిడి తెచ్చి మరీ విజయవాడకు మళ్లించారు. చివరికి సీబీఐ కోర్టును కూడా తరలించి విశాఖ ప్రాభవాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం వైజాగ్ పోర్టు, గంగవరం పోర్టు వంటి దిగ్గజ సంస్థల పక్కనే ఉండాల్సిన మారిటైం బోర్డును కూడా తీసుకెళ్లిపోవడంతో విశాఖకు ’ఆర్థిక రాజధాని’ ట్యాగ్ కేవలం బోర్డులకే పరిమితమైందని విమర్శలు వస్తున్నాయి.
అభివృద్ధి శూన్యం.. భూములే లక్ష్యం
విశాఖ నగరంపై చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్నది అభివృద్ధి కాంక్ష కాదు, భూములపై ఆశ మాత్రమేనని నగరవాసులు మండిపడుతున్నారు. విలువైన భూములను గీతం వంటి సంస్థలకు, ప్రభుత్వ అనుచరులకు కారుచౌకగా కట్టబెడుతున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడటం చేతకాని ప్రభుత్వం, దానిని క్రమంగా ప్రైవేటుపరం చేస్తూ విశాఖ కీర్తిని మసకబారుస్తోంది. గత రెండేళ్లుగా నగర మౌలిక సదుపాయాల కోసం నయాపైసా కేటాయించలేదు. చివరకు రోడ్ల నిర్వహణను కూడా పీపీపీ పద్ధతిలో ప్రైవేటు సంస్థలకు అప్పగించి ప్రజలపై భారం వేయాలని చూస్తోంది.
పోర్టుల నగరానికి దెబ్బ?
విశాఖపట్నం పోర్టు, గంగవరం పోర్టు వంటి కీలక నౌకాశ్రయాలు ఉన్న ఈ ప్రాంతం నుంచి మారిటైం బోర్డు కార్యాలయం పనిచేస్తే సమన్వయం సులభమవుతుందని నిపుణులు భావిస్తున్నారు. అదనంగా శ్రీకాకుళంలో అభివృద్ధి చెందుతున్న పోర్టు ప్రాజెక్టుల పర్యవేక్షణకూ విశాఖ అనువైన కేంద్రంగా ఉంది. అయితే ఈ అంశాలను పక్కనబెట్టి కార్యాలయాన్ని తరలించడం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మరింత అనుమానాలు రేకెత్తిస్తోంది.
దోచిపెట్టడమే లక్ష్యంగా..
ఒకవైపు ప్రచార ఆర్భాటాలతో విశాఖను ’గ్లోబల్ సిటీ’ అని ఊదరగొడుతూనే, మరోవైపు నగర ప్రాభవాన్ని తగ్గించేలా సాగుతున్న ఈ ’తరలింపుల పర్వం’ చూస్తుంటే.. విశాఖకు మేలు చేయడం కాదు, నగరాన్ని కేవలం ప్రైవేటు శక్తులకు దోచిపెట్టడమే లక్ష్యంగా కనిపిస్తోంది. పాలకుల అసలు రంగు మారిటైం బోర్డు తరలింపుతో మరోసారి బయటపడింది. ఆర్థిక రాజధాని హోదా దేవుడెరుగు.. ఉన్న ఆఫీసులను ఉంచితే చాలనే పరిస్థితికి విశాఖను దిగజార్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
విశాఖ నుంచి మంగళగిరికి మారిటైం బోర్డు తరలింపు
చట్టాన్ని తుంగలో తొక్కిన చంద్రబాబు ప్రభుత్వం
విశాఖ నుంచి ఒక్కొక్కటిగా చెక్కేస్తున్న కీలక కార్యాలయాలు
జీఎస్టీ, సీబీఐ, ఆర్‌బీఐ.. ఇప్పుడు మారిటైం బోర్డు వంతు
అభివృద్ధిని గాలికొదిలేసి.. భూముల పంపిణీపైనే సర్కార్ కన్నే..


