పిక్నిక్ పేరుతో జూదం
కొమ్మాది: భీమిలి బీచ్ రోడ్డులో ఆదివారం పిక్నిక్ పేరుతో భారీ ఎత్తున పేకాట శిబిరం నిర్వహించడం స్థానికంగా కలకలం రేపింది. కే నగరపాలెం సమీపంలోని పాత గోకార్టింగ్ ప్రాంతంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ జూద క్రీడలో పాల్గొన్నట్లు సమాచారం. బయటకు వినోద కార్యక్రమంగా కనిపించేలా భారీ షామియానాలు వేసి, లోపల రహస్యంగా లక్షలాది రూపాయలతో పేకాట సాగించినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద ఎత్తున జూదం జరుగుతున్నా పోలీసులు అటువైపు రాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే అండదండలతోనే ఈ శిబిరం నిర్వహించారని, పోలీసుల జోక్యం లేకుండా ఆయనే చూసుకున్నారని ప్రచారం జరుగుతోంది. నగరంలో అక్రమ మద్యం, జూదంపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ ప్రకటిస్తున్నప్పటికీ, అధికార పార్టీ నేతల విషయంలో నిబంధనలు అమలు కావడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


