ఇలాగైతే ఎలా పీల్చగలగాలి
విశాఖ సిటీ:
విశాఖలో గాలి విషతుల్యంగా మారుతోంది. నగరంలో కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రమాదకర ధూళి కణాలు ఊపిరాడకుండా చేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పోటీ పడుతూ గాలి నాణ్యత సూచీలు నమోదవుతున్నాయి. ప్రమాదకర కాలుష్యకారక నగరాల జాబితాలో విశాఖ చేరిపోయింది. సిటీ ఆఫ్ డెస్టినీని కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. ఇప్పుడిదే ఆందోళన కలిగిస్తోంది. విశాఖలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. గత వారం రోజులుగా ఈ సూచీలు విశాఖవాసులను కలవరపెడుతున్నాయి. గత 24 గంటల్లో విశాఖలో ఏక్యూఐ 313–329 మధ్య నమోదైంది. పగటి పూట కంటే అర్ధరాత్రి సమయాల్లోనే ఎక్కువగా ఉంటుండడం గమనార్హం.
పరిశ్రమలు, వాహనాలతో కాలుష్యం
ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమలు, వాహనాల కారణంగా నగరం కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది. ఇటీవల కాలంలో విశాఖలో భారీ పరిశ్రమలు, ఫార్మా కంపెనీలతో పాటు ఐటీ సంస్థలు విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో కాలుష్యం మరింత పెరుగుతోంది. వాస్తవానికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి 2009లోనే విశాఖ నగరాన్ని దేశంలోనే అత్యంత తీవ్ర కాలుష్య కోరల్లో ఉన్న నగరంగా పేర్కొంది. కొత్తగా మరే పరిశ్రమకు ఈ నగరంలో అనుమతి ఇవ్వకూడదని కూడా హెచ్చరించింది. అయితే అభివృద్ధికి ఆటంకంగా మారుతుందన్న అభిప్రాయంతో కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతూ మళ్లీ 2013లో కాలుష్య నగరాల జాబితా నుంచి విశాఖను తొలగించారు. దీంతో మళ్లీ విశాఖలో పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. పరిశ్రమల రాకతో ఉపాధి, ఉద్యోగావకాశాలు పెరుగుతున్నప్పటికీ.. అంతే స్థాయిలో కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయి. కాలుష్య నివారణకు పరిశ్రమలు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని పర్యావరణ వేత్తలు ఆందోళన చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
చలికాలంలోనే అధిక కాలుష్యం
నగరానికి ఒకవైపు బంగాళాఖాతం ఉండగా.. మిగిలిన మూడు వైపులా తూర్పు కనుములు వ్యాపించి ఉన్నాయి. వీటి మధ్య సుమారు 265 కి.మీ విస్తీర్ణంలో నగరం విస్తరించి ఉంది. నగరానికి నైరుతి దిక్కున భారీ పరిశ్రమలు ఉండడంతో ఏడాదికి 8 నెలల పాటు అంటే మార్చి నుంచి అక్టోబర్ వరకు అవి వెలువరించే వాయు, ధూళి కాలుష్యాలు గాలివాటంతో నగరాన్ని తాకుతున్నాయి. సుమారు 300 నుంచి 500 మీటర్ల ఎత్తుగా ఉండే ఈ కొండలు ఈ కాలుష్య వాయువులకు అడ్డుగా నిలబడి, వెనక్కు నెట్టి వేస్తున్నాయి. ఇక శీతాకాలంలో నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు తక్కువ ఉష్ణోగ్రతలు, మంచు కారణంగా కాలుష్యభరిత వాయువులు, హానికర ధూళి పదార్థాలు వాతావరణంలో పైకి పోలేక భూమి మీదనే కేంద్రీకృతం అవుతున్నాయి. సాధారణంగా భూమి మీద వేడి గాలులు, ఆ పైన చల్ల గాలులు ఉంటాయి. ఇవి శీతాకాలంలో తారుమారు అవుతూ ఉంటాయి. దీంతో హానికర ధూళి పదార్థాలను ఉపరితల వాతావరణంలోకి వెళ్లడం లేదు.
ఆందోళనకరంగా గాలి నాణ్యత
ప్రస్తుతం గాలి కాలుష్యం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గాలి కాలుష్య రేణువులు క్యూబిక్ మీటరుకు 60 మైక్రో గ్రాములు మించితే ప్రమాదం. కానీ పీఎం 2.5 రేణువులు శనివారం సాయంత్రం 7 గంటలకు 386గా ఉంది. పీఎం 10 రేణువులు కూడా 436 మైక్రోగ్రాములుగా నమోదయ్యాయి. ఈ తరహా వాయు కాలుష్యం ఆరోగ్యంపై అధిక ప్రభావం చూపుతోంది. ఊపరితిత్తుల ఇన్‌ఫెక్షన్, శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. చిన్నారుల్లో ఎక్కువగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ కాలుష్య నియంత్రణపై కూటమి ప్రభుత్వం సమీక్షలు నిర్వహించడం మినహా నివారణకు చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు.
ఆందోళనకరంగా సూచీలు
విశాఖలో గాలి నాణ్యత సూచీలు(ఏక్యూఐ) ఆందోళనకరంగా ఉన్నాయి. చలికాలంలో కాలుష్య మేఘాలు ఊపిరి సలవనివ్వకుండా చేస్తున్నాయి. గత వారం రోజులుగా ఢిల్లీతో పాటు ఏక్యూఐ 326 దాటుతోంది. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు ఏక్యూఐ అత్యధికంగా 329గా నమోదైంది. అది శనివారం ఉదయం 8 గంటలకు 322, మధ్యాహ్నం 12 గంటలకు 313గా ఉంది. పగటి పూట కంటే రాత్రి సమయాల్లోనే కాలుష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఎయిర్‌క్వాలిటీ ఇండెక్స్ 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తిగా, అదే ఏక్యూఐ 101 నుంచి 200 అయితే మోడరేట్‌గా, అంతకు మించి 201 నుంచి 300 అయితే పూర్, 301 నుంచి 400 వరకు అయితే వెరీ పూర్, 401 నుంచి 500 అయితే తీవ్ర ఆందోళనకర పరిస్థితిగా పేర్కొంటారు. అయితే విశాఖలో మాత్రం ప్రతి గంటకు గాలి నాణ్యత సూచీ పెరుగుతూ పోతోంది. సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి ఏక్యూఐ 290 దాటి అర్ధరాత్రికి 329కి చేరుకుంటోంది. అలాగే పార్టికులేట్ మేటర్(పీఎం) 10 రేణువులు ప్రమాదకర స్థాయిలో 436 చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది.


