పంచతంత్రం
‘బ్లూ ఫ్లాగ్ బీచ్‌లో
రుషికొండ సాగరతీరం 2020 అక్టోబర్ 11న ‘బ్లూఫ్లాగ్’గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో రుషికొండ బీచ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.7.35 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో అప్పటి ప్రభుత్వం వివిధ పనులు చేపట్టి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. ఏటా జ్యూరీ సభ్యులు బీచ్‌ను పరిశీలించి, ఈ ధ్రువీకరణ పత్రాన్ని పునరుద్ధరిస్తారు. 2023 వరకు సుందరంగా కనిపించిన బీచ్.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ‘బ్లూ ఫ్రాడ్’గా మారిపోయింది. ఇది అంతర్జాతీయ బీచ్ అనే విషయాన్ని కూడా మర్చిపోయింది. దీంతో డెన్మార్క్ సంస్థ రుషికొండ బీచ్‌కు ప్రపంచస్థాయి గుర్తింపును తాత్కాలికంగా రద్దు చేయడతో కూటమి సర్కారు ఉలిక్కిపడింది. హడావుడిగా తా త్కాలిక పనులు చేపట్టి.. మళ్లీ సర్టిఫికెట్‌ను పునరుద్ధరించేసుకుంది. ఇప్పు డు ఇదే బీచ్‌ను తమకు కాసులు కురిపించే కేంద్రంగా మార్చేందుకు చకచకా పావులు కదుపుతోంది.
ఓ అండ్ ఎం కోసం టెండర్లు.. కానీ..
తాజాగా ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్(ఓఅండ్‌ఎం), కాలుష్య నియంత్రణ, రెవెన్యూ సేకరణ కోసం గత నెలలో ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ఈ ప్రక్రియలోనే జనసేన నాయకుడు చక్రం తిప్పినట్లు ఆరోపణలున్నాయి. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అదే పార్టీకి చెందిన నేత కావడంతో.. ఆయన అండదండలతో విశాఖ రీజియన్ పర్యాటక శాఖను తన గుప్పిట్లోకి తీసుకున్నాడు. దీంతో ఆ నేత అడుగులకు మడుగులొత్తుతూ జిల్లా ఏపీటీడీసీ అధికారులు వ్యవహరిస్తున్నారు. టెండర్లలో పాల్గొనేందుకు ఎవరూ రాకుండా ఉండేలా చూడాలంటూ ఆ నేత హుకుం జారీ చేయడం.. టూరిజంలో ‘జగ’మంతా తెలిసిన అధికారి వెంటనే టెండరు నిబంధనలు కఠినతరం చేయడం చకచకా జరిగిపోయాయి.
టెండర్లలో పాల్గొన్నారో.?
ఆర్‌ఎఫ్‌పీ పిలిచేముందు.. ఆసక్తి కలిగిన సంస్థలతో టూరిజం అధికారులు గత నెలలోనే ఆన్‌లైన్‌లో ప్రీబిడ్డింగ్ మీట్‌ను నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సంస్థలకు టెండర్ నియమ నిబంధనల గురించి వివరించగా.. కష్టతరంగా ఉన్నాయని, గతంలో ఉన్న నిబంధనలే ఉంచాలని కొందరు కోరారు. ఈ సూచనలను టూరిజం అధికారులు తోసిపుచ్చారు. ఎవరెవరు ఆసక్తిగా ఉన్నారనే వివరాలను టూరిజం ప్రాంతీయ అధికారులు సేకరించి.. ఆ జాబితాను భీమిలి నేత చేతిలో పెట్టారు. ఇంకేముందు ఆ నేత ఆయా సంస్థల ప్రతినిధులకు ఫోన్లు చేసి బ్లూఫ్లాగ్ టెండర్లలో పాల్గొనవద్దని హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. కొందరు ఎదురించి మాట్లాడితే ‘ఈ టెండర్‌లో పాల్గొంటే, టూరిజంకి సంబంధించి భవిష్యత్తులో ఏ టెండరూ మీకు రాదు’అంటూ బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో వారంతా టెండర్ వేసేందుకు ముందుకు రాలేదు. దీంతో ఆ నేత పాచిక పారింది. త్వరలోనే సెకండ్ కాల్‌కి టెండర్లు ఆహ్వానించి.. తమ అనుయాయులకు అప్పగించేలా అంతా సెట్ చేశాడు. జిల్లా టూరిజం అధికారులు జనసేన నేతకు అనుకూలంగా బ్లూఫ్లాగ్ బీచ్ నిర్వహణ బాధ్యతలు అప్పగించేందుకు యత్నిస్తున్నారే తప్ప.. పర్యాటక శాఖ ఆదాయం, బీచ్ అభివృద్ధి గురించి పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బ్లూఫ్లాగ్ బీచ్‌పై భీమిలి జనసేన నేత కన్ను రుషికొండ బీచ్ నిర్వహణకు టెండర్ల ఆహ్వానం అధికారుల అండతో దోపిడీకి రంగం సిద్ధం?


