ఉపాధ్యాయుల పోరుబాట
విశాఖ విద్య: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులలో అసంబద్ధమైన ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పోరుబాటకు సిద్ధమైంది. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ నెల 21న జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ మేరకు డాబాగార్డెన్స్ ఆర్‌బీఎం ప్రాథమికోన్నత పాఠశాల ప్రాంగణంలో శనివారం సమావేశమైన ఉపాధ్యాయ సంఘాల నాయకులు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా పీఆర్‌టీయూ అధ్యక్షుడు గోపీనాథ్, ఎస్‌టీయూ జిల్లా కార్యదర్శి ఇమంది పైడిరాజు మాట్లాడుతూ 117 జీవో రద్దు పేరుతో ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన తొమ్మిది రకాల బడులు విద్యారంగాన్ని మరింత ప్రమాదంలో నెట్టే అవకాశం ఉందన్నారు. బదిలీలు, పదోన్నతులకు సంబంధించి అసంబద్ధమైన నిర్ణయాలతో ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. సంఘాల నాయకుల అభిప్రాయాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్ష ధోరణితో వ్యవహరించడం సరైందికాదన్నారు. బదిలీలు, పదోన్నతులు, రేషనలైజేషన్‌కు సంబంధించిన 16 రకాల డిమాండ్లతో పోరాటానికి పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఈనెల 21న డీఈవో కార్యాలయం ముట్టడికి ఉపాధ్యాయులు తరలిరావాలని పిలుపునిచ్చారు. దీనిని పెద్ద ఎత్తున విజయవంతం చేసేలా జిల్లా స్థాయిలో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. సభ్యులుగా వి.ఎస్.వేణుగోపాల్ (ఏపీహెచ్‌ఎంఏ), గోపీనాథ్ (పీఆర్‌టీయూ), ఇమంది పైడిరాజు (ఎస్టీయూ) టి.రామకృష్ణ (ఏపీటీఎఫ్ –257), జి.చిన్నబ్బాయి (యూటీఎఫ్), ఎ.అరుణ్ కుమార్ (ఏపీయూఎస్) ఎన్. ధనుంజయరావు (ఏపీటీఎఫ్–1938), బి.చిన్నారావు (ఏపీపీటీఏ) చొక్కాకుల సూర్యనారాయణ (వైఎస్సార్‌టీఏ) లను ఎన్నుకున్నారు. సోమవారం సాయంత్రం స్టీరింగ్ కమిటీ సమావేశమై డీఈవో కార్యాలయ ముట్టడికి సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు.
21న డీఈవో కార్యాలయం ముట్టడి
ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక సన్నద్ధత సమావేశం
9 రకాల బడులపై తీవ్ర వ్యతిరేకత


