రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ విజేత వైజాగ్
చీరాల రూరల్: యువకులు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి కనబరిచి సన్మార్గంలో నడవాలని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. స్థానిక ఎన్‌ఆర్‌అండ్‌పీఎం హైస్కూలు క్రీడా మైదానంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న కావూరి పవన్‌కుమార్ స్మారక రాష్ట్రస్థాయి ఇన్విటేషన్ ఫుట్‌బాల్ పోటీలు ఆదివారం రాత్రితో ముగిశాయి. ఈ పోటీల్లో రాష్ట్రంలోని అనేక నగరాలు పట్టణాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫైనల్‌లో విశాఖ, హుబ్లీ జట్టు తలపడ్డాయి. మొదటి ఫస్ట్ హాఫ్‌లో విశాఖ జట్టు రెండు గోల్స్ చేసింది. సెకండాఫ్‌లో హుబ్లీ జట్టు పుంజుకొని రెండు గోల్స్ సాధించింది. దీంతో అంపైర్లు ఇరు జట్లకు పెనాల్టీ షూట్ అవుట్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఇరుజట్లు సమంగా నిలిచాయి. మరోసారి అవకాశం ఇవ్వగా వైజాగ్ జట్టు అధిక గోల్స్ సాధించి విజేతగా నిలిచింది. రూ. 50 వేల నగదు బహుమతితో పాటు కప్‌ను ఎమ్మెల్యే చేతుల మీదుగా క్రీడాకారులు అందుకున్నారు.


