ఆ.. నర్సులకు నైట్ డ్యూటీలు
డాబాగార్డెన్స్: కేజీహెచ్‌లో కొన్నేళ్లుగా రాత్రి విధుల నుంచి తప్పించుకుంటున్న నర్సులకు ఎట్టకేలకు నైట్ డ్యూటీలు కేటాయించారు. ‘కొందరికే నైట్ డ్యూటీ ఎందుకు?’ శీర్షికతో గత నెల 23న ‘సాక్షి’ఓ కథనం ప్రచురించింది. కొన్నేళ్లుగా హెడ్ నర్స్ జెస్సీ ఈవెంజలీన్‌తో పాటు స్టాఫ్ నర్సులు నీలవేణి, ఎస్‌వై సత్యవతి, పాత్ర మోసెస్, ఎంవీ నాగమణి దేవి రాత్రి విధుల నుంచి ఏవేవో కారణాలు చూపుతూ తప్పించుకుంటున్నారు. వీరితో పాటు మరికొందరు ఈ జాబితాలో ఉన్నారు. ఈ కథనానికి స్పందించిన కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్ ఆ మరుసటి రోజే నర్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు, హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులతో సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, రొటేషన్ ప్రకారం నైట్ డ్యూటీలు చేయాలని ఆ సమావేశంలో స్పష్టం చేశారు. ఇటీవల కేజీహెచ్‌ను సందర్శించిన అదనపు డీఎంఈ కూడా పలు ఆదేశాలిచ్చారు. వార్డుల్లో ఏ సమస్య ఉన్నా హెడ్ నర్సులదే బాధ్యత అని, బ్లాకుకు ఒక హెడ్ నర్సు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో హెడ్ నర్స్ జెస్సీ ఈవెంజలీన్‌తో పాటు స్టాఫ్ నర్సులు నీలవేణి, ఎస్‌వై సత్యవతి, పాత్ర మోసెస్, ఎంవీ నాగమణి దేవికి ప్రస్తుతం నైట్ డ్యూటీలు కేటాయించారు. డీఎంఈ ఆదేశాల మేరకు బ్లాకుకు ఒక హెడ్ నర్స్‌ను నియమించారు.


