
హాస్య చోర చిత్రం ‘చౌర్యపాఠం’
ఏయూక్యాంపస్: దొంగతనం చేయడం వల్ల ఎదురయ్యే సమస్యలు, వాటి పరిణామాలను హాస్య ప్రధానంగా చూపుతూ తెరకెక్కిన చిత్రం ‘చౌర్యపాఠం’. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను నవ్వించి, అలరిస్తుందని చిత్ర దర్శకుడు నిఖిల్ గొల్లమూరి తెలిపారు. నగరంలోని కిర్లంపూడిలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన చిత్ర విశేషాలను వెల్లడించారు. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా ప్రజల ముందుకు రాబోతోందన్నారు. చిత్ర నిర్మాత త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ తాను గతంలో పలు చిత్రాలకు దర్శకుడిగా పనిచేశానని చెప్పారు. హీరో ఇంద్రరామ్ మాట్లాడుతూ సినిమాలో టన్నెల్‌లో జరిగే దొంగతనం సన్నివేశం చాలా వినూత్నంగా, హాస్యభరితంగా ఉంటుందన్నారు. హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ మాట్లాడుతూ సినిమాలో బ్యాంకు ఉద్యోగి అయిన నేను అనుకోని పరిస్థితుల్లో దొంగల ముఠాలో సభ్యురాలిగా మారే పాత్రలో నటించడం వైవిధ్యంగా అనిపించిందన్నారు. సినిమాలో గ్రామపెద్దగా కీలక పాత్రను పోషించానని చెప్పిన సీనియర్ నటుడు రాజీవ్ కనకాల విశాఖపట్నంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని వివరించారు.
దర్శకుడు నిఖిల్ గొల్లమూరి