సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనే చట్టాలు అవసరం | - | Sakshi
Sakshi News home page

సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనే చట్టాలు అవసరం

Mar 22 2025 12:49 AM | Updated on Mar 22 2025 12:48 AM

విశాఖ విద్య: ఆధునిక సాంకేతికత విసిరే సవాళ్లకు సమాధానమిచ్చే పటిష్టమైన చట్టాలను రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాద్‌ రావు అభిప్రాయపడ్డారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ న్యాయ కళాశాలలో శుక్రవారం జాతీయస్థాయి మూట్‌ కోర్టు పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ దుర్గాప్రసాదరావు మాట్లాడుతూ సమాజ అవసరాలకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు వస్తాయని తెలిపారు. శాసీ్త్రయ ఆవిష్కరణలు సమాజానికి ఎంతో మేలు చేస్తున్నాయని, అదే సమయంలో కొన్ని సవాళ్లను సైతం ఎదురవుతున్నాయని ఉదాహరణలతో వివరించారు. న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మార్పులను నిశితంగా గమనించాల్సిన అవసరం ఉందన్నారు. గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా రూ.13 వేల కోట్ల విలువైన మత్తుపదార్థాలను పట్టుకున్నారని చెప్పారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం గురించి వివరించి.. సైబర్‌ నేరాలు, శిక్షలు ఏ విధంగా విధిస్తారనే అంశాలను తెలియజేశారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను విరివిరిగా వినియోగిస్తున్నారని.. దీనితో మేధో హక్కులకు భంగం కలిగే అవకాశం ఏర్పడుతోందన్నారు. యూరోపియన్‌ దేశాలు హక్కులను రక్షించడానికి కఠినమైన చట్టాలను రూపకల్పన చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. భారత్‌లో ఈ రంగానికి సంబంధించి ప్రత్యేకమైన చట్టాలు ప్రస్తుతం లేవని, దీనిపై మేధో చర్చలు జరగాలని సూచించారు. ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్‌ మాట్లాడుతూ యువ న్యాయ విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం మంచి పరిణామమన్నారు. వివిధ కేసుల్లో వచ్చే తీర్పులపై సాధారణ ప్రజలకు సైతం అవగాహన కల్పించే సులభమైన విధానాలను రూపొందించాలని సూచించారు. న్యాయ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య కె.సీతామాణిక్యం మాట్లాడుతూ న్యాయ విద్యార్థులకు అవసరమైన ప్రత్యక్ష శిక్షణ, నైపుణ్యాలను అందించే విధంగా ఈ పోటీలు ఉంటాయని చెప్పారు. ఈ పోటీలకు దేశవ్యాప్తంగా 24 విద్యాసంస్థల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రాంగణంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహానికి అతిథులు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విశ్రాంత న్యాయమూర్తి యు.దుర్గా ప్రసాద్‌రావును సత్కరించారు. ఆచార్య వై. సత్యనారాయణ, ఆచార్య వి. కేశవరావు, ఆచార్య ఎస్‌. సుమిత్ర, ఆచార్య వి. రాజ్యలక్ష్మి, ఆచార్య వి. విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి

జస్టిస్‌ దుర్గా ప్రసాదరావు

ఏయూలో జాతీయస్థాయి మూట్‌ కోర్టు పోటీలు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement