
ఫిర్యాదు చేస్తే 90 రోజుల్లో పరిష్కారం
సాక్షి, విశాఖపట్నం: చట్టాలపై ప్రజలు అవగాహన పొందడం ద్వారా మోసపోకుండా ఉండవచ్చని జిల్లా వినియోగదారుల ఫోరం–1 ప్రెసిడెంట్ జి.తనూజరెడ్డి అన్నారు. వస్తు సేవలు, నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణాలు, ఇలా ఎందులో మోసం జరిగిందని భావించినా.. నిరభ్యంతరంగా జిల్లా వినియోగదారుల మండలిని ఆశ్రయించవచ్చని సూచించారు. ఎవరైనా.. ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేసే సాంకేతికత ఈ–జాగృతి పేరుతో అందుబాటులోకి వస్తోందని వెల్లడించారు. వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో పలు అంశాలపై ఆమె మాట్లాడారు.
ఫిర్యాదు చేయడం ఎలా అంటే.?
వినియోగదారుల మండలికి ఫిర్యాదు చేసి విధానం చాలా సులువు. తెల్ల కాగితంపై ఫిర్యాదు వివరాలు రాసి పంపవచ్చు. ఏ న్యాయవాది అవసరం లేకుండా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఇక్కడ హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశాం. మీరెలా మోసపోయారో చెబితే అంతా వారే సహకారం అందిస్తారు. అన్ని రకాల వస్తువులపై ఫిర్యాదు చేసే హక్కు వినియోగదారులకు ఉంది. లోపాలు, ఇబ్బందులు తలెత్తితే వస్తువు కొన్న రెండేళ్లలోపు ఫిర్యాదు చేయాలి. ఆలస్యమైతే పూర్తి ఆధారాలతో డిలే పిటిషన్ వేయవచ్చు. ప్రతివాది సంస్థ నోటీసులు అందిన 45 రోజుల్లో కౌంటర్ ఫైల్ చేయకపోతే.. తదుపరి ప్రొసీడింగ్స్ లేకుండానే కేసు పరిష్కృతమయ్యే అవకాశం ఉంది.
బిల్లు తప్పకుండా తీసుకోవాలి
వినియోగదారుడు ఏదైనా వస్తువును కొన్న తర్వాత బిల్లు తప్పకుండా తీసుకోవాలి. ఇదే ప్రాథమిక ఆధారం. అప్పుడే కేసు స్వీకరించేందుకు అవకాశం ఉంటుంది. వస్తు సేవల్లో నాణ్యత కొరవడినా, నష్టపోయినా పరిహారం పొందవచ్చు. రూ.5లక్షల లోపు వస్తువు ధర ఉంటే ఎలాంటి రుసుం లేకుండా వినియోగదారుల ఫోరం(కోర్టు)లో కేసులు వేయవచ్చు. రూ.5 లక్షలపైబడి ఉంటే.. రూ.400 నుంచి రూ.2 వేల వరకు రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
ప్రతి నెలా 30 నుంచి 40 ఫిర్యాదులు
ప్రతి నెలా 30 నుంచి 40 ఫిర్యాదులొస్తుంటాయి. ఇందులో టూ వీలర్, ఫోర్ వీలర్, వాటర్ ఫిల్టర్, గ్యాస్, పెట్రోల్ దుకాణాలు, ధరల వ్యత్యాసం, బీమా, వైద్యం వంటివి ఎక్కువగా ఉంటాయి. వచ్చిన ఫిర్యాదుల్లో బీమా కంపెనీల మోసాలపై 50 శాతం వరకు.. మోటర్ వాహనాలపై 30 శాతం ఉంటున్నాయి. ప్రస్తుతం వస్తున్న ఫిర్యాదుల్లో న్యాయవాది సాయంతో వస్తున్న ఫిర్యాదులే అధికంగా ఉన్నాయి.
త్వరితగతిన ఫిర్యాదుల పరిష్కారం
పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేస్తే.. 90 రోజుల్లో పరిష్కృతమై వినియోగదారుడికి పరిహారం అందించగలుగుతున్నాం. కొన్ని కేసులు మాత్రం ఎక్కువ సమయం పడుతున్నాయి. ప్రతి నెలా 30 కిపైగా కేసులు పరిష్కరిస్తున్నాం. ప్రస్తుతం 190 కేసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి.
పరిధి లేదు.. ఫిర్యాదు చేయవచ్చు
ఒకప్పుడు ఎక్కడ వస్తువు కొనుగోలు చేస్తే ఆ పరిధిలోనే ఫిర్యాదు చేసేవారు. చట్టంలో వచ్చిన మార్పులు వినియోగదారుడికి వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఎవరు ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేయవచ్చు. త్వరలోనే ఈ–జాగృతి అమల్లోకి రానుంది. అంటే పేపర్‌లెస్ విధానం. ప్రొసీడింగ్స్ మొత్తం ఆన్‌లైన్‌లోనే ఉంటాయి.
భయపడకుండా రావాలి
అన్యాయమైన వాణిజ్య విధానాలు, మోసపూరిత పద్ధతుల నుంచి న్యాయబద్ధమైన రక్షణ పొందడం వినియోగదారుల హక్కు. జిల్లా వినియోగదారుల ఫోరం ద్వారా నష్ట పరిహారం రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు, రాష్ట్ర కమిషన్ ద్వారా రూ. కోటి నుంచి రూ. 10 కోట్ల వరకు పొందవచ్చు. రూ.10 కోట్లు దాటితే జాతీయ వినియోగదారుల కమిషన్‌లో కేసులు వేసుకునే అవకాశం ఉంటుంది. మోసం జరిగిందని గుర్తిస్తే ప్రతి ఒక్కరూ భయపడకుండా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలని కోరుతున్నాం.
చట్టాలపై అవగాహనతో మోసాలకు చెక్
ఈ–జాగృతితో మరింత వెసులుబాటు
జిల్లా వినియోగదారుల ఫోరం–1ప్రెసిడెంట్ తనూజరెడ్డి