
విశాఖపట్నం: వరుసగా రెండు రోజులు సెలవులని అత్తారింటికి పిల్లలతో స్కూటీపై బయలు దేరిన భార్యాభర్తలు లారీ క్రింద పడి మృతిచెందిన సంఘటన శనివారం రాత్రి కె.కోటపాడు మండలం బొట్టవానిపాలెం వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరిలోవ ప్రాంతానికి చెందిన ఆడారి దామోదరరావు(32), ఆయన భార్య ప్రసన్న(25) అక్కడికక్కడే మృతిచెందారు. వివరాలివి. ఆరిలోవ ప్రాంతం నుంచి స్కూటీపై దామోదరరావు, భార్య ప్రసన్న, కుమార్తెలు యస్మిత, జోషితలతో అత్తవారి గ్రామమైన దేవరాపల్లి మండలం వేచలం బయలుదేరారు.
చిన్నగా చినుకులు పడుతున్నాయి. స్కూటీపై కింతాడ శివారు బొట్టవానిపాలెం వద్దకు చేరుకునే సమయంలో అదే మార్గంలో పినగాడి నుంచి కె.కోటపాడు వైపు రేషన్‌న్ బియ్యం లోడుతో లారీ వస్తోంది. లారీని ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించగా, ఎదురుగా వేరే వాహనం రావడంతో వాహనాన్ని ఆపబోయి లారీ వెనుక చక్రాల కిందికి స్కూటీ వెళ్లిపోయింది. వాహనం పైనున్న ఇద్దరు పిల్లలు రోడ్డుపై పడగా, భార్యాభర్తలు లారీ కిందపడ్డారు.
ఈ ఘటనలో ప్రసన్న తలపై నుంచి లారీ చక్రం వెళ్లడంతో తల నుజ్జయింది. దామోదరరావు తలకు గాయం కావడంతో రక్తస్రావం అధికంగా జరిగి సంఘటనా స్థలిలోనే మృతిచెందారు. గాయపడిన చిన్నారులను స్థానికులు 108లో కె.కోటపాడు సీహెచ్‌సీలో వైద్యం అందించారు.