ఆక్రమణల క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతం
మహారాణిపేట: ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు ఆధారంగా ఆక్రమణల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జనవరి నాటికి పెండింగ్ దరఖాస్తులను పూర్తిగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విశాఖ, భీమిలి డివిజన్ల రెవెన్యూ అధికారుల సమావేశం జరిగింది. జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్‌తో కలిసి కలెక్టర్ వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గాజువాక ప్రాంతానికి చెందిన జీవో నం.45, యూఎల్సీ పరిధిలోని జీవో నం.27, కన్వెయన్స్ డీడ్‌లకు సంబంధించిన జీవో నం.296, సాధారణ ఆక్రమణల క్రమబద్ధీకరణకు సంబంధించిన జీవోలపై క్షేత్రస్థాయి అధికారులకు, ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని తహసీల్దార్లకు సూచించారు. జీవో ఎం.ఎస్. నం.30 ప్రకారం అమలవుతున్న ఆక్రమణల క్రమబద్ధీకరణ–2025 పథకం కింద జిల్లాలో వచ్చిన దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేసి, తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
మెట్రో పనుల్లో జాప్యం వద్దు
భూ క్రమబద్ధీకరణ, రీ–సర్వే, హౌసింగ్, యూఎల్సీ కేసులపై కలెక్టర్ సమీక్షించారు. మెట్రో రైల్ ప్రాజెక్టు భూసేకరణలో ఎలాంటి జాప్యం ఉండకూడదని, మెట్రో మార్గాల వెంట అక్రమ దుకాణాలు, వీధి వ్యాపారాలకు అనుమతి ఇవ్వరాదని స్పష్టం చేశారు. మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ధిలో విద్యుత్ లైన్లు, అండర్ గ్రౌండ్ వాటర్ పైప్‌లైన్ల ఏర్పాటులో సమన్వయం పాటించాలని సూచించారు. ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల జారీ, మ్యుటేషన్ వంటి సేవల్లో నిర్ణీత గడువు పాటించాలని ఆదేశించారు. సమావేశంలో విశాఖ, భీమిలి ఆర్డీవోలు సుధాసాగర్, సంగీత్ మాధుర్, సర్వే శాఖ డీడీ, కలెక్టరేట్‌లోని వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.


