నో హెల్మెట్.. నో పెట్రోల్
అల్లిపురం: నగరంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, మరణాలను అరికట్టేందుకు సిటీ పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ద్విచక్ర వాహనచోదకులు హెల్మెట్ ధరించకపోతే పెట్రోల్ బంకుల్లో ఇంధనం పోయకూడదని ఆదేశాలు జారీ చేశారు. ‘నో హెల్మెట్–నో పెట్రోల్’ పేరిట తీసుకువచ్చిన ఈ నిబంధనను జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేస్తామని బంక్ నిర్వాహకులు చెబుతున్నారు.
బంకు యజమానులకు ఆదేశాలు
ఈ విధానం అమలుపై నగరంలోని అన్ని పెట్రోల్ బంకుల యజమానులకు పోలీసులు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. హెల్మెట్ లేని వాహనదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్రోల్ పోయవద్దని, ఈ విషయంలో పోలీసులకు పూర్తిగా సహకరించాలని కోరారు. పోలీసుల సూచనల మేరకు బంకు సిబ్బంది కూడా వాహనదారులను ముందుగానే హెచ్చరిస్తున్నారు. హెల్మెట్ లేకుండా వస్తే పెట్రోల్ లభించదని స్పష్టం చేస్తూ.. బంకుల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.
జరిమానాలు వేసినా మారని తీరు
హెల్మెట్ లేని వాహనదారుల ఫొటోలు తీసి నిరంతరం జరిమానాలు(ఈ–చలానాలు) విధిస్తున్నప్పటికీ, చాలామందిలో మార్పు రావడం లేదని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు హెల్మెట్‌ను భారంగా భావిస్తున్నారని, మరికొందరు పోలీసుల కోసమే ధరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజల్లో మార్పు తెచ్చేందుకు పెట్రోల్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు.
కుటుంబాల భద్రత కోసమే..
ఇది వాహనదారులను ఇబ్బంది పెట్టేందుకు కాదని, వారి ప్రాణ రక్షణ కోసమేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాద సమయాల్లో ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చని గుర్తుచేస్తున్నారు. కేవలం వాహనం నడిపే వ్యక్తే కాకుండా, వెనుక కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అతివేగం, డ్రైవింగ్‌లో మొబైల్ వాడకం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటివి ప్రమాదాలకు ప్రధాన కారణాలని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, హెల్మెట్ ధరించడం ద్వారా మన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడవచ్చని హితవు పలికారు. ప్రజలంతా బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రమాద రహిత విశాఖ జిల్లా నిర్మాణానికి సహకరించాలని పోలీస్ యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.
జనవరి 1 నుంచి అమలు


