పోలీసింగ్‌లో ఇతర శాఖల సహకారం కీలకం
అల్లిపురం: నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి అధ్యక్షతన శనివారం సిరిపురం వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో వార్షిక నేర సమీక్ష సమావేశం–2025 జరిగింది. ఈ సమావేశానికి కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రెవెన్యూ, జ్యుడీషియల్, జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, ఎకై ్సజ్, కోస్ట్ గార్డ్, ఎన్‌సీబీ తదితర శాఖల అధికారులతో కలిసి ఈ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. నగరంలో పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన విధివిధానాలను సూచించారు. తమ శాఖల నుంచి పోలీసు శాఖకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గడిచిన ఏడాది కాలంగా నగరంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్, నేరాల తీరుపై సీపీ ఆయా అధికారులతో విశ్లేషించారు. ప్రతి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోతో మాట్లాడి.. ఈ ఏడాది వారి స్టేషన్ పరిధిలో అమలు చేసిన ఉత్తమ పోలీసింగ్ విధానాలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఏడాదిలో తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.
94 మందికి రివార్డుల ప్రదానం
సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, విధుల్లో ప్రతిభ కనబరిచిన వారికి సీపీ ప్రోత్సాహకాలు అందించారు. నగర పోలీస్ శాఖలో హోంగార్డు నుంచి సీఐ స్థాయి వరకు.. ప్రతి నెలా ఉత్తమ పనితీరు కనబరుస్తున్న 94 మందిని గుర్తించి, ఉన్నతాధికారుల సమక్షంలో సీపీ రివార్డులు అందజేశారు.
13 మందికి పదోన్నతులు
కమిషనరేట్‌కు చెందిన 13 మంది సిబ్బందికి పదోన్నతులు కల్పిస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఒక మహిళా ఏఎస్‌ఐకి ఎస్‌ఐగా, ఒక హెడ్ కానిస్టేబుల్‌కు ఏఎస్‌ఐగా, ఐదుగురు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా, ఆరుగురు ఏఆర్ కానిస్టేబుళ్లకు ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించారు. పదోన్నతి పొందిన సిబ్బందిని వారి కుటుంబ సభ్యులతో సహా వేదికపైకి ఆహ్వానించి, సీపీ స్వయంగా ర్యాంకులను అలంకరించి, పోస్టింగ్ ఆర్డర్లను అందజేశారు.
పోలీసింగ్‌లో ఇతర శాఖల సహకారం కీలకం


