ఫార్మా నిర్వాసితులకు అండగా ఉంటాం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు
తాటిచెట్లపాలెం: గాజువాక నియోజకవర్గం లేమర్తి గ్రామానికి చెందిన ఫార్మాసిటీ నిర్వాసితులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజుకు బాధితులు వినతిపత్రం అందజేశారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో శనివారం గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి ఆధ్వర్యంలో వారు కేకే రాజును కలిశారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ.. 2005లో ఫార్మా పరిశ్రమల స్థాపన కోసం తమ భూములను ఇచ్చామని, ఆ సమయంలో తమకు శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తామని అప్పటి ప్రభుత్వం, కంపెనీలు హామీ ఇచ్చాయని గుర్తుచేశారు. అయితే 20 ఏళ్లు గడుస్తున్నా ఆ హామీ పూర్తిగా అమలు కాలేదన్నారు. కొన్ని కంపెనీలు మాత్రమే పర్మినెంట్ చేశాయని, మరికొన్ని యాజమాన్యాలు ఇంకా కాంట్రాక్ట్ పద్ధతిలోనే కొనసాగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు కోల్పోయి, ఉద్యోగ భద్రత లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ సమస్యను మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరారు. దీనిపై కేకే రాజు సానుకూలంగా స్పందించారు. నిర్వాసితుల సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ప్రభుత్వం స్పందించి ఫార్మా కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించేవరకు వైఎస్సార్‌సీపీ తరఫున అండగా ఉండి పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. వార్డు అధ్యక్షుడు పూర్ణనాథ శర్మ, యల్లపు వాసు, నక్క రమణబాబు తదితరులు పాల్గొన్నారు.


