భక్త కోటి ఇష్టదైవం బొజ్జ గణపయ్య తొలి పూజకు వేళాయింది..

- - Sakshi

విశాఖపట్నం: భక్త కోటి ఇష్టదైవం బొజ్జ గణపయ్య తొలి పూజకు వేళాయింది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న నవరాత్రి ఉత్సవాల కోసం నగరం శోభాయమానమైంది. వినాయక చవితి వేడుకలకు మండపాలు అందంగా ముస్తాబయ్యాయి. మహా నగరం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. మరోవైపు వినాయక విగ్రహాలు, పూలు, పండ్లు, పూజా సామగ్రి తదితర వస్తువుల కొనుగోళ్లతో పూర్ణామార్కెట్‌, అక్కయ్యపాలెం, మధురవాడ, గాజువాక, కంచరపాలెం తదితర ప్రాంతాల్లోని మార్కెట్లు కళకళలాడాయి. ప్రధాన రహదారులకు ఇరువైపులా అమ్మకాలతో సందడి నెలకొంది.

పర్యావరణహిత మట్టి ప్రతిమల పట్ల నగరవాసులు ఆసక్తి చూపారు. స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల నేతలు, వివిధ సంస్థలు ఇప్పటికే వందలాది మట్టి విగ్రహాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశాయి. మధురవాడ, కంచరపాలెం, అక్కయ్యపాలెం, గాజువాక, పెదగంట్యాడ తదితర ప్రాంతాల్లో భారీ వినాయక విగ్రహాల అమ్మకాలు ఆఖరి రోజైన ఆదివారం జోరుగా సాగాయి. విగ్రహాల తరలింపు, పూలు, పండ్లు, పూజా వస్తువుల కొనుగోళ్ల కోసం జనం పెద్ద ఎత్తున రహదారులపైకి చేరడంతో నగరంలోని పలు చోట్ల ఉదయం నుంచే ట్రాఫిక్‌ రద్దీ నెలకొంది.

వైవిధ్యమూర్తులు..
ఈ సారి కూడా వైవిధ్యభరితమైన విగ్రహమూర్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. బీహెచ్‌ఈఎల్‌ దరి గ్లోబెక్స్‌ థియేటర్స్‌ వద్ద 112 అడుగుల విగ్రహం, పాతగాజువాక దరి లంకా మైదానంలో 117 అడుగుల విగ్రహం, దొండపర్తిలోని రామాలయం వద్ద 108 అడుగుల భారీ గణనాథుడి విగ్రహాలు ముస్తాబయ్యాయి. వీటితో పాటు అర్ధనారీశ్వరుడి సమక్షంలో కొలువైన బొజ్జ గణపయ్య, బహు ముఖ వినాయకుడు, భక్తుల మదిని దోచే వివిధ రకాల భంగిమలు, ఆకృతులతో, చక్కటి రంగులతో అద్భుతంగా తీర్చిదిద్దిన విగ్రహాలు ఇప్పటికే మండపాలకు చేరుకున్నాయి.

సందడిగా మార్కెట్లు.. ధరలకు రెక్కలు
వినాయక చవితి సందర్భంగా పూజ కోసం వినియోగించే 21 రకాల పత్రి, బంతి పూలు, మామిడి ఆకులు, మారేడు కాయల అమ్మకాలతో మార్కెట్లలో సందడి నెలకొంది. పండగ సందర్భంగా పూల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. హోల్‌ సేల్‌ మార్కెట్‌లో బంతిపూలు కిలో రూ.90 వరకు ఉంటే పూల దుకాణాల వద్ద కిలో రూ.150 వరకు విక్రయించారు. పూర్ణా మార్కెట్‌లో 50 గ్రాముల పువ్వులు రూ.100 పైగా అమ్మకాలు జరిపారు. చామంతి పూలు, గులాబీ, తదితర పువ్వుల ధరలు సైతం భారీగా పెరిగాయి.

Read latest Visakhapatnam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top