తూతూ మంత్రంగా చర్యలు
వికారాబాద్: డ్రగ్స్ మహమ్మారి భయపెడుతోంది.. జిల్లాలో తరచూ గంజాయి కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం ఏడు నెలల వ్యవధిలో 115 కేజీల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 20 కేసులు నమోదు చేశారు. 37 మంది రిమాండ్‌కు తరలించారు. మత్తులో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల నల్లగొండ జిల్లాలో ఓ పాఠశాల ప్రిన్సిపాల్ హత్యకు గురికాగా.. నిందితులు ఆమె చేత విద్యా బుద్దులు నేర్చుకున్న వారు కావడం విస్మయానికి గురిచేసింది. పోలీసుల విచారణలో గంజాయే కారణమని తేలడం భయబ్రాంతులకు గురిచేస్తోంది. జిల్లాలో కూడా ఈ సంస్కృతి హెచ్చుమీరుతోంది. సాధారణ జనంతో పాటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గతంలో తాండూరులో కొందరు ఆకతాయిలు గంజాయి మత్తులో విద్యార్థులను వేధింపులకు గురి చేశారు. పరిగిలోనూ కొందరు రోడ్లపై హల్ చేశారు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఏంటని ప్రశ్నించగా అతనిపై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనపై కేసు కూడా నమోదైంది.
బానిసలవుతున్న యువత
కళాశాలల విద్యార్థులు, యువత ఎక్కువగా గంజాయికి బానిసలవుతున్నారు. మత్తు పదార్థాల వాడకంలో కొత్త పద్ధతులు పాటిస్తున్నారు. లిక్విడ్, సిటరెట్ల రూపంలో అందుబాటులో ఉండటంతో వాటిని వినియోగిస్తున్నారు. చరాస్ పేరుతో ఉన్న మత్తు పదార్థాన్ని ఇటీవల ఎక్కువగా వినిగిస్తున్నట్టు సమాచారం. చిక్కుడు గింజ ఆకారంలో ఉండే దీన్ని సగం చొప్పున ఇద్దరు వినియోగిస్తున్నట్లు తెలిసింది. పాన్‌షాపులే అడ్డాగా ఈ దందా సాగుతున్నట్లు సమాచారం.
రైళ్ల ద్వారా సరఫరా
కర్ణాటక, బీదర్, సోలాపూర్, గుల్బర్గ, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు రైలు మార్గంలో గంజాయి సరఫరా చేస్తున్నారు. తాజాగా తాండూరు రైల్వే స్టేషన్‌లో భారీగా పట్టుబడింది. ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురిని అరెస్టు చేశారు. ఐదేళ్ల క్రితం వరకు గుట్టుగా సాగే ఈ దందా ఇటీవల కాలంలో కోరలు చాచింది. విద్యార్థులు కూడా బానిసలవ్వడం తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఆడ పిల్లల తల్లిదండ్రులు పిల్లలను బయటికి పంపాలంటేనే జంకుతున్నారు. ఇటీవల ఆకతాయిల వేధింపులు ఎక్కువ కావడంతో హడలిపోతున్నారు. గతంలో తాండూరు, వికారాబాద్, పరిగి ప్రాంతాల్లో బాలికలు, యువతులను మత్తు బాబులు ఇబ్బందులకు గురి చేశారు.
కోరలు చాచిన గంజాయి, డ్రగ్స్
జిల్లాలో తరచూ పట్టుబడుతున్న నిషేధిత పదార్థాలు
ఏడు నెలల్లో 115 కేజీల గంజాయి స్వాధీనం
20 కేసులు నమోదు,
37 మందికి రిమాండ్
గ్రామాలకు చేరిన మత్తు కల్చర్
లిక్విడ్, సిగరెట్ల రూపంలో వినియోగం
ఆందోళనలో బాధిత కుటుంబాలు
ఏడాది కాలంలో గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు భారీగా పట్టుబడుతున్నాయి. సివిల్, ఆబ్కారి పోలీసులు నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరపడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు. ఎవరు సరఫరా చేస్తున్నారు.. గంజాయి ఎక్కడ పండిస్తున్నారు వంటి వివరాల జోలికి వెల్లడం లేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో వందలాది మంది యువత గంజాయికి అలవాటు పడినట్లు నిఘా సంస్థల అంచనా వేస్తున్నాయి. చిన్న చిన్న గ్రామాల్లో సైతం పదుల సంఖ్యలో బానిసలు ఉన్నట్లు తెలిసింది.


