2,10,297మంది ఓటర్లకు నోటీసులు | - | Sakshi
Sakshi News home page

2,10,297మంది ఓటర్లకు నోటీసులు

Aug 21 2026 9:50 AM | Updated on Aug 21 2026 9:50 AM

నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేస్తాం

త్వరలో ఎన్నికల సిబ్బందికి శిక్షణ

కలెక్టర్‌ దీపక్‌ తివారి

అనంతగిరి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా నో మ్యాపింగ్‌, అనామలిస్‌ ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నట్లు కలెక్టర్‌ దీపక్‌ తివారి తెలిపారు. బుధవారం నగరం నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మ్యాపింగ్‌ కాని ఓటర్లు, అనామలీస్‌ వివరాలపై సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటు లభించిన 2,10,297మందికి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. ఇందు కోసం త్వరలో బూత్‌స్థాయి అధికారులు, సూపర్‌వైజర్లు, సంబంధిత సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వెంకటాచారి, డీఆర్‌ఓ స్వర్ణలత, మున్సిపల్‌ కమిషనర్‌ విక్రమ్‌సింహారెడ్డి, ఎన్నికల సూపరింటెండెంట్‌ నేమత్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు ఇబ్బందులు కలిగించొద్దు

కుల్కచర్ల: విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా బోధన చేయాలని కలెక్టర్‌ దీపక్‌ తివారి సూచించారు. బుధవారం మండలంలోని బండవెల్కిచర్ల గిరిజన బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పాఠశాలలో డ్రైనేజీ, తాగునీటి సమస్య ఉందని వసతి గృహ ప్రత్యేకాధికారి బాలవరలక్ష్మి కలెక్టర్‌కు దృష్టికి తెచ్చారు. సర్పంచ్‌తో మాట్లాడి నిధులు మంజూరయ్యేలా చూస్తామని తెలిపారు. తాగునీటి కోసం బోరు వేయిస్తామన్నారు. కట్టెల పొయ్యిపై వంట చేయడాన్ని పరిశీలించి గ్యాస్‌ కనెక్షన్‌ మంజూరు చేయాలని సివిల్‌ సప్లయ్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత విద్యా సంవత్సరంలో మంచి ఫలితాలు రావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మల్టీపర్సస్‌ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. క్యూరింగ్‌ చేయడం లేదని గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేసి బిల్లులు ఆపేయాలని ఆదేశించారు. సంజీవరెడ్డి రైతు పొలంలో అయిల్‌ పామ్‌ సాగును, రాంనగర్‌లో కూరగాయల సాగును పరిశీలించారు. కుల్కచర్లలో పీహెచ్‌సీని సందర్శించారు. ఆస్పత్రికి ప్రహరీ నిర్మించాలని సర్పంచ్‌ అంజిలయ్య కోరారు. అంచనాలు పంపాలని డీఎంఎచ్‌ఓ సుధాకర్‌లాల్‌కు సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ ఆంజనేయులు, తహసీల్దార్‌ పురుషోత్తం, ఎంపీడీఓ రామకృష్ణ, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్‌ నాయక్‌, బండవెల్కిచర్ల సర్పంచ్‌ శ్రీనివాస్‌, ఉప సర్పంచ్‌ గోవర్ధన్‌ రెడ్డి, ఎంఈఓ హబీబ్‌ అహ్మద్‌, హౌసింగ్‌ ఏఈ హర్ష, ఏపీఓ చంద్రశేఖర్‌, కుల్కచర్ల మండల వైద్యాధికారి కిరణ్‌కుమార్‌ గౌడ్‌, ఉప సర్పంచ్‌ విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement