పాలకవర్గాలు లేక.. సమావేశాలు సాగక! | - | Sakshi
Sakshi News home page

పాలకవర్గాలు లేక.. సమావేశాలు సాగక!

Aug 16 2026 8:26 AM | Updated on Aug 16 2026 8:26 AM

మండలాల వారీగా

ఎంపీటీసీ స్థానాలు

వికారాబాద్‌: ఇటీవల జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న మండల సమావేశాల్లో సభ్యులు లేని వెలితి స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రతి మూడు నెలలకు క్రమం తప్పకుండా మండల సర్వసభ్య సమావేశాలు నిర్వహించేవారు. రెండేళ్లుగా మండల పరిషత్‌ పాలక వర్గాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో సమావేశాలు జరగడం లేదు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులకు తెలియజేసేందుకు అవకాశం లేకుండా పోయింది. గతంలో ప్రజా సమస్యలపై సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు గళం విప్పేవారు. దీంతో చాలా సమస్యలు కొలిక్కి వచ్చేవి. నేడు పల్లెల్లో అనేక సమస్యలు తాండవం చేస్తున్నా అధికారులను అడిగే వారు లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో అధికారులు సర్పంచులతో మండల స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు లేక సమావేశాలు చప్పగా సాగుతున్నాయి. జిల్లాలో ఏడాది క్రితం ఎంపీటీసీ, జెడ్పీటీసీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. పాలక వర్గాల పదవీ కాలం ముగిసి రెండేళ్లు దాటినా ప్రభుత్వం ఎన్నికల ఊసెత్తకపోవడంతో ఆశావహులు నిరాశకు గురవుతున్నారు.

జీపీ, మున్సిపల్‌ ఎన్నికలతో సరి..

పార్టీ గుర్తుపై నిర్వహించే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పక్కన పెట్టిన ప్రభుత్వం పంచాయతీ, మున్సిపాలిటీలకు నిర్వహించి చేతులు దులుపుకొంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఆశావహులు రెండేళ్లుగా ఆశగా ఎదురుచేస్తున్నారు. ప్రభుత్వంలో కదలిక లేకపోవడంతో మరి కొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. నెల రోజుల క్రితం జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి మండల సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్‌ దీపక్‌ తివారిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో పది రోజుల నుంచి అధికారులు మండల స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థలకు సంబంధించి కేవలం సర్పంచులు మాత్రమే ఉండటంతో వారితోనే తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు. వికారాబాద్‌ నియోజకవర్గ సమావేశాల్లో కలెక్టర్‌ దీపక్‌ తివారి, స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ పాల్గొన్నారు. మిగతా మండలాల్లో అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇదిలా ఉండగా జెడ్పీ చైర్మన్‌ అధ్యక్షతన నిర్వహించే జిల్లా జనరల్‌ బాడీ సమావేశాలు పాలక వర్గాలు లేక నిర్వహించడం లేదు. ప్రజా సమస్యలపై చర్చించే వారు లేక సమస్యలు పరిష్కారం కావడం లేదు.

ఏడాది క్రితం రిజర్వేషన్లు ఖరారు

గతేడాది మండల, జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందనే సంకేతాలు రావడంతో అధికారులు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఖరారు చేశారు. మండలాల వారీగా పురుషులు, సీ్త్రలు, ట్రాన్స్‌ జెండర్ల ఓటర్ల జాబితాను, పోలింగ్‌ స్టేషన్లు ప్రకటించారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చారు. కొత్తగా ఏర్పాటైన మండలాలు, పక్క మండలాల నుంచి కలిసిన గ్రామాలు, మండలాల నుంచి మున్సిపాలిటీల్లో కలిసిన గ్రామాలను పరిగణలోకి తీసుకుని మండలాల వారీగా ఎంపీటీసీ స్థానాల సంఖ్యను నిర్ణయించారు. ఒక్కో ఎంపీటీసీ పరిధిలో సగటున 3,083 మంది ఓటర్లు, జెడ్పీటీసీ పరిధిలో 34,997 మంది ఓటర్లు ఉండేలా జాబితాను సిద్ధం చేశారు.

జిల్లాలో పెరిగిన స్థానాలు

2019 మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం మండల పరిషత్‌లతో పాటు ఎంపీటీసీల సంఖ్య కూడా పెరిగింది. గతంలో 18 మండల పరిషత్‌కు ఎన్నికలు జరగ్గా కొత్తగా చౌడాపూర్‌, దుద్యాల మండలాలు ఏర్పాటయ్యాయి. వీటికి కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. గతంతో 18 మండల పరిషత్‌ల పరిధిలో 221 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా ప్రస్తుతం వీటి సంఖ్య 227కు చేరింది. మన జిల్లా పరిధిలోని బొంరాస్‌పేట, నారాయణపేట్‌ జిల్లా పరిధిలో కోస్గి మండలాల నుంచి కొన్ని గ్రామాలను తీసుకుని కొత్త మండలం దుద్యాలను ఏర్పాటు చేశారు. కుల్కచర్ల మండలానికి చెందిన కొన్ని గ్రామాలు, మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలంలో కలిసిన మరి కొన్ని గ్రామాలతో మరో కొత్త మండలంగా చౌడాపూర్‌ను ఏర్పాటు చేశారు. పరిగి మండలం నుంచి కొన్ని గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం చేసినప్పటికీ నవాబుపేట కోస్గి మండలాల నుంచి గ్రామాలు మన జిల్లాలో కలవటంతో ఎంపీటీసీల సంఖ్య పెరిగింది. జిల్లాలో అత్యల్పంగా బంట్వారంలో 6 ఎంపీటీసీలు ఉండగా.. అత్యధికంగా మర్పల్లి, తాండూరు మండలాల్లో 15 మంది చొప్పున ఉన్నారు. జిల్లాలో మొత్తం 3,44,963 పురుషులు, 3,54,912 మంది సీ్త్రలు, 19 మంది ట్రాన్స్‌ జెండర్లు కలుపుకొని మొత్తం 6,99,894 మంది ఓటర్లు ఉన్నారు. 20 మండలాల పరిధిలో 1,288 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో 400 ఓటర్ల నుంచి 750 మంది ఓటర్ల వరకు ఉన్నారు. ప్రస్తుతం సర్‌ ప్రక్రియ పూర్తయినందున ఓటర్ల సంఖ్య భారీగా పెరగనుంది.

మండలం 2019లో 2025లో ఓటర్ల సంఖ్య

బంట్వారం 6 6 17,690

బషీరాబాద్‌ 12 12 41,178

బొంరాస్‌పేట్‌ 15 11 32,086

చౌడాపూర్‌ 0 9 25,176

ధారూర్‌ 12 12 36,304

దోమ 14 14 44,359

దౌల్తాబాద్‌ 15 14 41,758

దుద్యాల 0 8 20,967

కొడంగల్‌ 11 11 32,144

కోట్‌పల్లి 7 7 21,361

కుల్కచర్ల 16 12 38,413

మర్పల్లి 15 15 45,455

మోమిన్‌పేట్‌ 12 12 39,788

నవాబుపేట్‌ 12 12 37,917

పరిగి 13 11 31,202

పెద్దేముల్‌ 13 13 40,820

పూడూరు 13 13 43,419

తాండూరు 15 15 47,107

వికారాబాద్‌ 7 07 24,250

యాలాల్‌ 13 13 38,500

మొత్తం 221 227 6,99,894

సర్పంచులతో మండల మీటింగ్స్‌ నిర్వహిస్తున్న అధికారులు

రెండేళ్ల క్రితం ముగిసిన ఎంపీపీలు, జెడ్పీటీసీల పదవీ కాలం

ఎన్నికలపై క్లారిటీ ఇవ్వని ప్రభుత్వం

ఆశావహుల ఎదురు చూపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement