నేటి నుంచి పింఛన్ దరఖాస్తుల స్వీకరణ
బషీరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘చేయూత’ పింఛన్ల పథకంలో భాగంగా శుక్రవారం నుంచి కొత్త లబ్ధిదారుల ఎంపిక కోసం దరఖాస్తుల స్వీకరించనున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు అర్హులైన వారు దరఖాస్తులు సమర్పించుకోవచ్చని జిల్లా అధికారులు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో జీపీలు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కార్యాలయాలతో పాటు ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అర్జీలు తీసుకుంటారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, కల్లుగీత కార్మికులు, ఫైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులు, థలసేమియా, సికిల్‌సెల్, హీమోఫీలియా వంటి వ్యాధులతో బాధపడుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం నిర్దేశించిన అర్హతల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. దరఖాస్తు ఫారంతో పాటు ఆధార్, రేషన్ కార్డు, ఆదాయ, నివాస ధ్రువపత్రాలు, బ్యాంకు ఖాతా వివరాలు, అవసరమైతే వైద్య ధ్రువపత్రాలు జతచేయాల్సి ఉంటుంది.
మళ్లీ దరఖాస్తు చేయొద్దు
ఇప్పటికే ప్రజాపాలన, ప్రజావాణి, గ్రామసభల్లో అవసరమైన పత్రాలు సమర్పించిన వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే పత్రాలు అసంపూర్తిగా ఉన్నవారు, ఇప్పటివరకు దరఖాస్తు చేయని వారు ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో 1,07,113 మంది సామాజిక భద్రతా పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. ప్రతి నెలా కోట్ల రూపాయలను ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేస్తోంది. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హుల జాబితాను అధికార యంత్రాంగం సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపనుంది. సర్కారు ఆమోదం లభించిన వారికి కొత్త పింఛన్లు మంజూరు కానున్నాయి. గడువు ముగిసేలోపు అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యంత్రాంగం సూచించింది. గడువు ముగిసిన తర్వాత దరఖాస్తులను స్వీకరించబోమని స్పష్టం చేశారు.
జీపీలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక కౌంటర్లు
అర్జీలు తీసుకోనున్న అధికారులు
ఈ నెల 31వరకు అవకాశం
జిల్లాలో ఇప్పటికే లబ్ధిపొందుతున్న వారు 1,07,113
జిల్లాలో పింఛన్
లబ్ధిదారుల సంఖ్య
వితంతువులు 48,508
వృద్ధులు 39,665
దివ్యాంగులు 12,326
ఒంటరి మహిళలు 4,564
హెచ్‌ఐవీ రోగులు 1,130
కల్లుగీత కార్మికులు 403
బోదకాలు 194
డయాలసిస్ 181
చేనేత కార్మికులు 142
మొత్తం 1,07,113


