వికారాబాద్: స్వాతంత్య్ర దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కలెక్టరేట్ మైదానంలో జరుగుతున్న పనులను శుక్రవారం కలెక్టర్ దీపక్‌తివారి, ఎస్పీ స్నేహమెహ్ర జిల్లా ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. నేటి ఉదయం(శనివారం) 9గంటలకు వేడుకలు ప్రారంభం కానున్నాయి. ముఖ్య అతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. శాఖల వారీగా శకటాల ప్రదర్శన, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందు చేయనున్నాయి. ఉత్తమ సేవలందించిన అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేయనున్నారు.
ఏర్పాట్ల పరిశీలన
వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ దీపక్‌తివారి, ఎస్పీ స్నేహ మెహ్ర పరిశీలించారు. ఘనంగా నిర్వహించాలని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. వీఐపీ గ్యాలరీ, మైదానాన్ని పరిశీలించారు. అనంతరం పోలీసుల పరేడ్ రిహార్సల్స్‌ను పర్యవేక్షించారు.
కార్యక్రమ వివరాలు
వేడుకల ఏర్పాట్లకు సంబంధించిన షెడ్యూల్‌నుకలెక్టరేట్ అధికారులు విడుదల చేశారు. ఉదయం 9గంటలలోపు అధికారులు కలెక్టరేట్‌లోని మైదానానికి చేరుకుంటారు. 9:20 గంటలకు ఎస్పీ స్నేహమెహ్ర, 9:23 గంటలకు కలెక్టర్ దీపక్‌తివారి సభా ప్రాంగణానికి వస్తారు. 9:25 గంటలకు స్పీకర్ ప్రసాద్‌కుమార్ హాజరవుతారు. 9:27 గంటలకు జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. 9:30కి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.9:40కి స్పీకర్, కలెక్టర్, ఎస్పీ పోలీ సుల గౌరవ వందనం స్వీకరిస్తారు. 9:50కి స్పీకర్ జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 10:15కి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 11గంటలకు అవార్డుల ప్రదానం, 11:40 గంటలకు జాతీ య గీతాలాపనతో కార్యక్రమం ముగుస్తుంది.
పోలీసులకు ఫిట్‌నెస్ ఎంతో కీలకం
అనంతగిరి: పోలీసులకు ఫిట్‌నెస్ ఎంతో కీలకమని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శుక్రవారం వికారాబాద్‌లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పునరుద్ధరించిన జిమ్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీస్ విధులు ఎంతో బాధ్యతాయుతమైనవని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఉత్సాహం పెరుగుతాయని తెలిపారు. అనంతరం ఎస్పీ స్నేహ మెహ మాట్లాడారు. జిమ్ పరికరాల మంజూరు, డీపీఓ కార్యాలయానికి పెయింటింగ్, మరమ్మతులకు కృషి చేసిన కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, పీఆర్ ఈఈ ఉమేష్, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు


