తాండూరు రూరల్: యూరియా కోసం పెద్దేముల్ మండల రైతులు రోడ్డెక్కారు. శుక్రవారం ఉదయం మారెపల్లి, జనగాం, గాజీపూర్, పెద్దేముల్, నాగులపల్లి, తింసన్‌పల్లి రైతులు పెద్ద సంఖ్యలో పెద్దేముల్ ఎఫ్‌ఏపీఎస్ కార్యాలయానికి వచ్చారు. యాప్‌లో బుక్ చేసుకున్న వారికే యూరియా ఇస్తామని అధికారులు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పత్తి, వరి పంటలకు యూరియా వాడాల్సి ఉన్నందున ఆధార్ కార్డుపై ఇవ్వాలని కోరారు. అందుకు అధికారులు నిరాకరించడంతో పెద్దేముల్ – సంగారెడ్డి రోడ్డు వద్దకు చేరుకొని బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాతో రోడ్డుకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న మండల వ్యవసాయాధికారి పవన్ ప్రీతం ఘటనా స్థలానికి చేరుకొని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా వారు వినలేదు. యాప్‌తో సంబంధం లేకుండా ఆధార్ కార్డుపై యూరియా పంపిణీ చేయాలని పట్టుబట్టారు. 1,060 బస్తాలు మాత్రమే ఉండటంతో యాప్‌లో బుక్ చేసుకున్న వారికి ఇచ్చామని ఏఓ వివరించారు. మా వద్ద స్మార్ట్ ఫోన్లు లేవని, ఎరువులు ఎలా బుక్ చేసుకోవాలో చెప్పాలని పలువురు రైతులు ఏఓను నిలదీశారు. సోమవారం యూరియా వస్తుందని అందరికీ పంపిణీ చేస్తామని చెప్పడంతో రైతులు శాంతించారు.
యాప్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్
పెద్దేముల్ – సంగారెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన


