మోమిన్‌పేట: ప్రీ ప్రైమరీ టీచర్ల నియామకంలో చోటుచేసుకున్న అవకతవకలపై శుక్రవారం ‘సాక్షి’ దినపత్రికలో అనర్హులకు అందలం అనే శీర్షికన ప్రచురితవమైన కథనానికి కలెక్టర్ దీపక్ తివారి స్పందించారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక సమర్పించాలని జెడ్పీ సీఈఓ సుధీర్‌ను ఆదేశించారు. ఉదయం ఆయన మండలంలోని ఎన్కేపల్లి ప్రాథమిక పాఠశాలను సందర్శించి వివరాలు సేకరించారు. ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ పోస్టు కోసం గ్రామానికి చెందిన కావలి మాధవి దరఖాస్తు చేసింది. అన్ని సర్టిఫికెట్లు జత పరిచింది. అయితే డీఈఓ కార్యాలయంలో నివాస ధ్రువీకరణ పత్రాన్ని తీసేశారు. దీంతో అర్హత ఉన్నా ఆమెను కాదని మరొకరికి పోస్టింగ్ ఇచ్చారు. బాధితురాలు డీఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ సుధీర్ మాట్లాడుతూ.. ఇన్‌స్ట్రక్టర్ నియామకంపై పూర్తిస్థాయి విచారణ చేసి అర్హులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఆయన వెంట ఇన్‌చార్జ్ ఎంపీడీఓ రాజమల్లయ్య, ఎంపీఓ సంజయ్‌కుమార్, ఎంఈఓ నర్సింలు, సర్పంచ్ సురేందర్, కార్యదర్శి అరుంధతి, పాఠశాల హెచ్‌ఎం అనిల్ తదితరులు ఉన్నారు.


