కొడంగల్: కొడంగల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా డీ చంద్రశేఖర్‌రెడ్డి నియమితులయ్యారు. శుక్రవారం ఆయన బాధ్య తలు స్వీకరించారు. ఇక్కడపని చేసిన శ్రీధర్‌రెడ్డి బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో చంద్రశేఖర్‌రెడ్డి విధుల్లో చేరారు.
వేడుకగా
‘జీవన్ దాత వందనం’
తల్లిదండ్రులకు పాదపూజ చేసిన మార్వాడీలు
తాండూరు టౌన్: జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించుకోవడంలో భాగంగా పట్టణ మార్వాడీ యువమంచ్ ఆధ్వర్యంలో స్థానిక బాలాజీ మందిర్‌లో జీవన్ దాత వందన ఉత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మార్వాడీలు వారి తల్లిదండ్రులకు పాదపూజ చేసి గౌరవించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జన్మనిచ్చి, పెంచి పోషించి పెద్ద వారిని చేసిన తల్లిదండ్రుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదన్నారు. వారి పట్ల గౌరవభావంతో, ప్రేమతో నడు చుకోవాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో భావితరాలు వారి తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన గౌరవం, ఉన్నత స్థానంపై అవగాహన ఏర్పర్చుకుంటారన్నారు. కార్యక్రమంలో మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు మన్మోహన్ సార్డా, తాండూరు అధ్యక్షుడు కిషన్ రాఠి, కార్యదర్శి కరణ్ జైన్, అనిల్ సార్డా, కుంజ్ బిహారీ సోని, అరుణ్ సార్డా, దీపక్ గగరాణి, మహేష్ సార్డా, లక్ష్మి నారాయణ బూబ్, రమాకాంత్ పండిట్, సన్నీ అగర్వాల్, మధు సోని, మహిళా మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
వివేకానందుడి బాటలో నడుద్దాం
అనంతగిరి: నేటి యువత స్వామి వివేకానందుడిని ఆదర్శంగా తీసుకొని, ఆయన బాటలో నడవాలని విద్యా భారతి క్షేత్ర సంఘటన కార్యదర్శి సుధాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలో ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఓ ఫంక్షన్ హాల్‌లో యువ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత సన్మార్గంలో నడవాలని సూచించారు. ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుని దాని సాధనకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అనంతగిరి జిల్లా సంఘ చాలక్ డాక్టర్ సత్యనారాయణగౌడ్, తెలంగాణ ప్రాంత బౌద్దిక్ ప్రముఖ్ కూర జయదేవ్, నగర కార్యవాహ సంగమేశ్వర్, ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు, ప్రముఖులు, యువకులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేద్దాం
మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
మర్పల్లి: బీఆర్‌ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్తా సైనికుడిలా పని చేయాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సూచించారు. శుక్రవారం మండలంలోని పంచలింగాల గ్రామంలో పార్టీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన మండల స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఆరు గ్యారంటీల్లో ఒక్కటి కూడా సక్రమంగా అమలు కావడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని, రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. అంతకుముందు స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి బీఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరించారు. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కాంగ్రెస్, బీజేపీకి చెందిన 80 మంది యువకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి ఆనంద్ పార్టీ కాండువాలు కప్పి బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు.
పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ
జాయింట్ డైరక్టర్ డాక్టర్ జయలక్ష్మి
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో గల ఏసీటీసీ సెంటర్‌ను శుక్రవారం తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ జాయింట్ డైరక్టర్ డాక్టర్ జయలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ తర్వాత వికారాబాద్, అనంతగిరి, పరిగి సెంటర్లను తనిఖీ చేశారు. ప్రతి సెంటర్‌లో రికార్డులు, మందుల నిల్వలు, సిబ్బంది హాజరును పరిశీలించారు. ఎయిడ్స్ పరీక్షలు, కౌన్సెలింగ్ సక్రమంగా నిర్వహిస్తున్నారా అనే దానిపై ఆరా తీశారు. వ్యాధి గ్రస్తులకు మరింత మెరుగైన, గోప్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. పరీక్షలు, కౌన్సెలింగ్‌లో నిర్లక్ష్యం వహించరాదన్నారు. కేంద్రాలకు వచ్చే వారికి సకాలంలో సేవలు అందించాలని ఆదేశించారు. ఆమె వెంట అధికారులు నరేందర్, రమేష్ తదితరులు ఉన్నారు.


