తాండూరు: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మనిషి జీవన శైలి మారుతూ వచ్చింది. ఒకప్పుడు కుటుంబంలో సంపాదించిన ప్రతి అణా లెక్క పెట్టి ఖర్చు చేసేవారు. నెల జీతం చేతికి రాగానే ముందుగా బియ్యం, పప్పులు, నూనె, పాలు, కట్టెలు.. ఆ తర్వాత పిల్లల చదువులు, దుస్తుల వంటి అవసరాలకు వెచ్చించే వారు. తర్వాత మిగిలితే కొంత పొదుపు, అవసరమైతే బంగారం లేదా భూమి కొనుగోలు వంటితో కుటుంబ విలువలకు ప్రాధాన్యం ఉండేది. నేటి కుటుంబ బడ్జెట్‌ను చూస్తే ఇంటి అద్దెలు, రుణాలు పొందిన ఈఎంఐ చెల్లింపులు, పిల్లల స్కూల్ ఫీజులు, వైద్యం రవాణా, మొబైల్ రీచార్జ్‌లు, ఇంటర్నెట్, ఓటీటీ, బీమా, పెట్టుబడులు ఇలా ఖర్చుల జాబితా చాంతాడంత పెరిగింది.
నాడు 16 అణాలకే విలువ
1947లో దేశ బడ్జెట్ వ్యవస్థలో రూపాయికి 16 అణాలు ఉండేవి. ఆ రోజుల్లో నగదు ఆదాయం తక్కువగా ఉండటంతో ప్రతి చిన్న ఖర్చుకు విలువ ఉండేది. కుటుంబంలో ఆహారమే ప్రధాన వ్యయం. బియ్యం, పప్పులు, పాలు లాంటి వస్తువులకు 80 శాతం ఆహారానికే ఖర్చు. అప్పట్లో కిలో బియ్యం ఐదారు అణాల ధర పలికేది. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో తులం బంగారం ధర రూ.80 నుంచి రూ.90 పలికింది. వ్యవసాయ భూములు సైతం ఎకరాకు రూ.వందల్లో కొనుగోలు చేశారు. అప్పట్లో రూ.150–300 వరకు వేతనం లభించినా కుటుంబ అవసరాలు తీరిపోయేవి. అప్పట్లో రవాణా సౌకర్యం కోసం ఎక్కువగా ఎద్దుల బండ్లు, గుర్రాలు, పల్లకి లాంటి వాటితో రాకపోకలు, రావాణా కొనసాగించే వారు. ప్రస్తుతం కిలో బియ్యం ధర రూ.50 నుంచి రూ.70 వరకు పలుకుతోంది. బంగారం ఽప్రస్తుతం తులం (పది గ్రామాలు) రూ.1.50 లక్షలకు పైగా పలుకుతోంది.
కుటుంబ నియంత్రణకు పెద్దపీట
1947లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ప్రధానంగా ఉండేది. 1947 నుంచి 1980 వరకు ఉమ్మడి కుటుంబాలు కనిపించేవి. తర్వాత కుటుంబాల్లో పెళ్లయిన జంటకు సంతానం ఐదుగురు పిల్లలకు తగ్గకుండా ఉండేది. 1980 తర్వాత కుటుంబ నియంత్రణ మొదలైంది. ఉమ్మడి కుంటుంబాల నుంచి తల్లిదండ్రులు, పిల్లలు ఉంటేనే ఒక కుటుంబం అనే విధానం అందుబాటులోకి వచ్చింది. అప్పట్లో పిల్లల ఆకలిని తీర్చడమే తల్లిదండ్రుల బాధ్యతగా ఉండేది. ప్రస్తుతం బాగా చదివించడం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుండటంతో ఆర్థికంగా భారంగా మారింది. అప్పట్లో మధ్యతరగతి కుటుంబం రూ.300 నుంచి రూ.500 వరకు ఖర్చులతో సరిపెట్టే వారు. ప్రస్తుతం నెలకు రూ.20 వేల నుంచి రూ.80 వేలు వచ్చినా సరిపోవడం లేదు. మరోవైపు రవాణా వ్యవస్థ మెరుగు పడింది. గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా ప్రతి ఇంటికీ రెండుమూడు ద్విచక్రవాహనాలు, సగటున 50 ఇళ్లకు ఒక కారు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు ఆర్టీసీ బస్సులు, రైలు మార్గాలు, విమానయాన మార్గాలు మెరుగు పడ్డాయి. అప్పట్లో ఇతర ప్రాంతాల్లో ఉండే వారికి సమాచారం అందించాలంటే వారాల సమయం పట్టేది. సెల్‌ఫోన్‌లు, వీడియో కాల్ సాంకేతిక విధానం అందుబాటులోకి రావడంతో క్షణాల్లో ఏ సమాచారమైనా ప్రజల చెంతకు చేరుతోంది.
నాడు స్థానిక వనరులతో ఇంటి నిర్మాణాలు
దేశానికి స్వాతంత్య్రం రాక ముందు ఓ కుటుంబం ఇంటి నిర్మాణం చేసుకోవాలంటే స్థానికంగా ఉన్న వనరులతోనే చేపట్టే వారు. భారీగా భవనాల నిర్మాణం కోసం భోజన వసతి కల్పిస్తే కార్మికులు పని చేసే రోజులు. ప్రసుతం ఓ భవనం నిర్మించాలంటే కుటుంబ ఆర్థిక స్థితిని బట్టి రూ.లక్షల నుంచి రూ.కోట్లలోకి చేరింది. నాడు కోట గోడలతో నాలుగు ప్రాకారాల్లో భవనాలు కనిపించేవి. పలు ఇళ్లకు బంధువులు వస్తే వారి కోసం విడిది ఇళ్లు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం మధ్యతరగతి కుటుంబం సింగిల్ బెడ్ రూమ్‌లకే పరిమితం చేస్తున్నారు.


