రైతులపైనే రవాణా! | - | Sakshi
Sakshi News home page

రైతులపైనే రవాణా!

Aug 11 2026 7:15 AM | Updated on Aug 11 2026 7:15 AM

ఎరువుల బస్తాలపై ట్రాన్స్‌పోర్ట్‌ ఛార్జీల వసూలు

తాండూరు రూరల్‌: మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది రైతుల పరిస్థితి. ఓ పక్క ఎల్‌నినో ప్రభావంతో సరైన వర్షాలు కురవక, ఎరువులు దొరకక ఇబ్బందులు పడుతుండగా, ప్రస్తుతం యూరియా బస్తాలపై రవాణా ఛార్జీలు పెంచడం మరింత భారంగా మారింది. ప్రస్తుతం సాగు చేసిన వరి, పత్తి పంటలకు యూరియా వేయడం అత్యవసరం. కానీ ప్రభుత్వం ఎరువులు పొందేందుకు కొత్త యాప్‌ ఎఫ్‌ఎఫ్‌ఎస్‌(ఫ్రేమ్‌ వర్క్‌ ఫర్‌ ఫెర్టిలైజర్‌ సేల్‌)ను తీసుకొచ్చింది. చాలా మంది రైతుల వద్ద పాత యూరియా యాప్‌ మాత్రమే ఉంది. కొత్త యాప్‌పై ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన రాలేదు. దీంతో యూరియా కోసం అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. కొంత మంది కొత్త యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నా.. అందులో తాండూరు ప్రాంతంలోని దుకాణాల్లో యూరియా కొరత, స్టాక్‌ లేదని చూపిస్తోందని చెబుతున్నారు.

ఒక్కో బస్తాపై రూ.43 అదనం

ప్రస్తుతం ప్రభుత్వం ఒక్కో యూరియా బస్తా ధర రూ.267 నిర్ణయించింది. గతంలో ట్రాన్స్‌పోర్ట్‌ ఛార్జీలు ప్రభుత్వమే చెల్లించేది. దీంతో ఎరువుల దుకాణం యజమానులు మద్దతు ధరకే యూరియాను విక్రయించేవారు. తాజాగా జూలై 15నుంచి ట్రాన్స్‌ఫోర్ట్‌ ఛార్జీలను రైతులే చెల్లించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఒక్కో యూరియా బస్తాపై రూ.43 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఈలెక్కన బస్తా ధర రూ.310కి పెరిగింది. సాగు సంకటంగా మారిన ప్రస్తుత తరుణంలో రైతులపై అదనపు భారం మోపడం సరికాదని ప్రతిపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని పేర్కొంటున్నారు.

దూరాన్ని బట్టి..

దూరాన్ని బట్టి ట్రాన్స్‌పోర్ట్‌ ఛార్జీలను వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ శివారులోని మేడ్చల్‌, మూసాపేట్‌, తిమ్మాపూర్‌ ప్రాంతాల నుంచి జిల్లాలోని వివిధ సొసైటీ కార్యాలయాలతో పాటు, ఫెర్టిలైజర్‌ దుకాణాలకు ఎరువులు వస్తాయి. దూరాన్ని బట్టి రవాణా ఛార్జీలు పెంచారు. వికారాబాద్‌ ప్రాంతంలో ఒక్కో ఎరువు బస్తాపై రూ.28, కొడంగల్‌ నియోజకవర్గం హస్నాబాద్‌లో రూ.44, తాండూరులో రూ.43, బషీరాబాద్‌కు రూ.51 ధర నిర్ణయించారు. ఈమొత్తాన్ని రైతుల నుంచే వసూలు చేస్తున్నారు.

ఒక్కో బ్యాగుపై

రూ.28 నుంచి రూ.51 అదనం

ప్రభుత్వ నిర్ణయంపై

అన్నదాతల ఆందోళన

ప్రభుత్వ ఆదేశాల మేరకే..

ఎరువుల బస్తాల రవాణా ఛార్జీలను గతంలో ప్రభుత్వమే చెల్లించేది. తాజాగా జూలై 15నుంచి రైతుల వద్దే వసూలు చేయాలని నిర్ణయించింది. దూరాన్ని బట్టి ఛార్జీలు అమలవుతున్నాయి. తాండూరులో ఒక్కో యూరియా బస్తాపై రూ.310 ధర ఉంది.

– కొమురయ్య, ఏఓ, తాండూరు

సరైన నిర్ణయం కాదు

ట్రాన్స్‌పోర్ట్‌ ఛార్జీలను రైతుల నుంచి వసూలు చేయడం సరైన నిర్ణయం కాదు. గతేడాది అతివృష్టి కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాలు లేక పంటల దిగుబడి కష్టంగా ఉంది. అప్పులు తెచ్చి పంటలు సాగు చేస్తున్నాం. రవాణా ఛార్జీలు మోపడం అన్యాయం. – భద్రు, రైతు, సిరిగిరిపేట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement