ఉప్పల్‌లోని ఓ డిగ్రీ కాలేజీలో ఘటన ● తోటి విద్యార్థిపై ముగ్గురి దాడి
ఉప్పల్: ఉప్పల్‌లోని ఓ డిగ్రీ కాలేజీలో తోటి విద్యార్థి చెప్పినట్లు వినలేదనే సాకుతో ముగ్గురు విద్యార్థులు తోటి విద్యార్థిపై దాడిచేశారు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన మేరకు.. లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కళాశాలలో నాగోల్ ప్రాంతానికి చెందిన భువన మోహిత్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదుతున్నాడు. అదే కళాశాలకు చెందిన ఛత్రీష్, యశ్వంత్, వినయ్‌లు చెప్పినట్టు వినలేదని మోహిత్‌పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈ నెల 3 కళాశాల వాష్‌రూమ్‌లోకి తీసుకెళ్లి దాడి చేశారు. అతని మొబైల్ ఫోన్‌ను విసిరి కొట్టారు. ఈ సంఘటనలో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. గతంలో కూడా పలుమార్లు ఆ విద్యార్థితో దురుసుగానే ప్రవర్తించినట్లు బాధితుడు తెలిపారు. అయినప్పటికీ కళాశాల యాజమాన్యం ఆ విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, గతంలోనే చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని బాధితుడి తండ్రి తెలిపారు. ఈ నెల 4న ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయంపై కళాశాల ప్రిన్సిపల్‌ను వివరణ కోరగా అందుబాటులోకి రాలేదు.
‘పది’విద్యార్థుల పైశాచికం
జవహర్‌నగర్: ఓ కార్పొరేట్ పాఠశాల హస్టల్‌లో పదోతరగతి విద్యార్థిపై తోటి విద్యార్ధులు దారుణంగా దాడిచేశారు. ఈ ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడ స్కూల్‌లో చోటుచేసుకుంది.తల్లిదండ్రులు, ఏసీపీ చక్రపాణి తెలిపిన మేరకు...కామారెడ్డికి చెందిన ఓ విద్యార్థి (15) దమ్మాయిగూడలోని కార్పొరేట్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతూ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ నెల 7న అర్ధరాత్రి విద్యార్థిపై 9 మంది తోటి విద్యార్ధులు కర్రలతో కొట్టి, బూట్లతో ముఖంపై దారుణంగా కొట్టారు. దీంతో స్పృహతప్పిపడిపోయాడు. వార్డెన్ గమనించి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మెట్ల కిందపడి గాయాలయ్యాయని చెప్పారు. దీంతో వారు కుమారుడిని తీసుకెళ్లి కామారెడ్డిలోని ఆస్పత్రిలో చేర్పించారు. ర్యాగింగ్ పేరుతో దాడి చేసినట్లు చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నా కుమారుడిని చంపినా ఇంతేనా ..?
కార్పొరేటర్ పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పిస్తారని నమ్మకంతో చేర్పించామని.. తోటి విద్యార్థులు విచక్షణారహితంగా కొట్టి హింసించినా యాజమాన్యం పట్టించుకోకపోవడంపై విద్యార్ధి తల్లి శోభ మండిపడ్డారు. మా వాడిని చంపినా ఇంతేనా?అని వాపోయారు. సీసీ కెమెరాలను చూపించాలని చెప్పినా అవి పనిచేయడం లేదని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడిచేసిన విద్యార్థులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


