సెక్రటరీ సూచన మేరకే మార్చాం
సొంత భవనాలకు తాళం..
మొయినాబాద్: కళాశాల విద్యార్థుల వసతి గృహం కోసం రూ.కోట్లు ఖర్చుచేసి ప్రభుత్వ భవనం నిర్మించారు. ఇందులో వసతి గృహానికి బదులుగా సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఏర్పాటు చేశారు. కొంత కాలం పాటు గురుకులాన్ని నడిపించి సరిపడా వసతులు లేవని అదనపు గదులు, ప్రహరీ నిర్మించారు. చివరికి ఈ భవనాన్ని వదిలి గురుకులాన్ని ప్రైవేటు భవనంలోకి మార్చారు. అక్కడ రూ.లక్షల్లో అద్దె చెల్లిస్తూ.. ప్రభుత్వ భవనాలను వృథాగా వదిలేశారు. ఇదీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థ అధికారుల పనితీరు.
రూ.2 కోట్లు వెచ్చించి..
మొయినాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో పదేళ్ల క్రితం కళాశాల విద్యార్థుల(బాలికల) వసతిగృహాన్ని నిర్మించారు. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా రూ. కోటి నిధులతో భవనాన్ని నిర్మించి ప్రారంభించారు. కానీ కళాశాల బాలికల హాస్టల్‌ను మాత్రం అందులో ఏర్పాటు చేయలేదు. అంతలోనే ప్రభుత్వం కొత్త గురుకులాలు ఏర్పాటు చేయడంతో శంకర్‌పల్లి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఈ భవనంలో ప్రారంభించారు. విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించడంకోసం ఈ భవనంపై విడతలవారీగా అదనపు గదులు, వంటశాల, ల్యాబ్ నిర్మించారు. మరో రూ.కోటితో ప్రహరీ నిర్మించారు. ఏడాది క్రితం వరకు శంకర్‌పల్లి గురుకులం ఇక్కడే కొనసాగింది. గతేడాది శంకర్‌పల్లి గురుకులాన్ని ఇక్కడి నుంచి పెద్దమంగళారం సమీపంలోని ఆజాద్ కళాశాలకు చెందిన ప్రైవేటు భవనంలోకి మార్చారు.
రూ.లక్షల్లో అద్దె చెల్లింపు
ప్రభుత్వ భవనాలను వదిలి ప్రైవేటు భవనంలోకి గురుకులాన్ని తరలించిన అధికారులు అక్కడ నెలకు రూ.లక్షల్లో అద్దె చెల్లిస్తున్నారు. ప్రస్తుతం శంకర్‌పల్లి గురుకులం కొనసాగుతున్న ఆజాద్ కళాశాల భవనానికి నెలకు రూ.5 లక్షలకు పైగా అద్దె చెల్లిస్తున్నట్లు సమాచారం. ప్రైవేటు భవనాల యజమానులు ఇచ్చే కమీషన్లకు ఆశపడే అధికారులు గురుకులాలను వాటిలోకి మారుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొయినాబాద్ మండలంలో వివిధ ప్రాంతాలకు చెందిన గురుకుల పాఠశాలలు, కళాశాలలు ప్రైవేటు కళాశాలలకు చెందిన అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి.
వృథాగా మారిన ప్రభుత్వ భవనాలు
శంకర్‌పల్లి బాలికల గురుకులాన్ని ప్రైవేటు అద్దె భవనంలోకి మార్చడంతో ప్రభుత్వ భవనం వృథాగా మిగిలిపోయింది. ఏడాది క్రితమే ఇక్కడ ల్యాబ్ నిర్మించారు. వాటిని పూర్తిస్థాయిలో వినియోగించకుండానే నిరుపయోగంగా వదిలేశారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుచేసి నిర్మించిన ప్రభుత్వ భవనాలను నిరుపయోగంగా మార్చిన అధికారుల తీరుపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేటు భవనానికి నెలకురూ.5 లక్షల పైనే కిరాయి చెల్లింపు
నిరుపయోగంగా మారిన సర్కార్ భవనాలు
అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం
ఏడాది క్రితం వరకు గురుకుల పాఠశాలను మొయినాబాద్ తహసీల్దార్ కార్యాలయం వెనకాల ఉన్న ప్రభుత్వ భవనంలోనే కొనసాగించాం. గురుకుల సొసైటీ సెక్రటరీ సూచన మేరకే గురుకులాన్ని ఆజాద్ కళాశాలకు చెందిన భవనంలోకి మార్చాం. గత ఏడాది ఆ భవనంలో ప్రత్యేక శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. శిక్షణ పూర్తయిన తరువాత భవనం ఖాళీగా ఉంది. ఈ ఏడాది కూడా ప్రత్యేక శిక్షణ శిబిరం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
– కృష్ణవేణి, ప్రిన్సిపల్, శంకర్‌పల్లి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల


