నో సేఫ్టీ! | - | Sakshi
Sakshi News home page

నో సేఫ్టీ!

Jul 16 2026 7:24 AM | Updated on Jul 16 2026 7:24 AM

కాలం చెల్లిన బోట్ల వినియోగం రక్షణ చర్యలు శూన్యం పర్యాటకుల ప్రాణాలతో చెలగాటం గతేడాది సర్పన్‌పల్లి ప్రాజెక్టులోపడవ మునిగి ఇద్దరు మృతి నామమాత్రపు చర్యలతోసరిపెడుతున్న యంత్రాంగం

వికారాబాద్‌: జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా రిసార్ట్స్‌ నిర్వహిస్తున్నారు. ధనార్జనే తప్ప పర్యాటకుల భద్రత నిర్వాహకులకు పట్టడం లేదు. బోటింగ్‌, పలు రకాల అడ్వెంచర్‌ గేమ్స్‌, మందు, పేకాట, హోటల్స్‌ వంటి సౌకర్యాల పేరిట అందినకాడికి దోచుకుంటున్నారు. వికారాబాద్‌కు కూతవేటు దూరంలో సర్పన్‌పల్లి ప్రాజెక్టు ఉంది. దీని సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా వైల్డర్‌ నెస్‌ క్యాంప్‌ సైట్‌ పేరిట రిసార్ట్‌ నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టు పరిసరాలు మొత్తం వారి ఆధీనంలో ఉంచుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బోటింగ్‌ నిర్వహిస్తున్నారు. గతేడాది బోటు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు పర్యాటకులు మృతిచెందారు. మరో ఇద్దరిని తోటి వారు కాపాడారు. అప్పట్లో సంబంధిత అధికారులపై తీవ్ర విమర్శలు రావడంతో హడావుడి చేశారు. రిసార్ట్స్‌ను మూసివేశారు. రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌ శాఖల ఆధ్వర్యంలో విచారణ కమిటీ వేశారు. ఆ కమిటీ నివేదిక కూడా ఇచ్చింది. కానీ అందులో ఏముందో బయటపెట్టలేదు. నిర్వాహకుల తప్పిదంతోనే పర్యాటకుల చనిపోయినట్లు విచారణలో తేలినట్టు సమాచారం. ఘటన జరిగి ఏడాది పూర్తయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రిసార్ట్స్‌ను మూసివేసిన కొద్ది రోజులకే మళ్లీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అసైన్డ్‌ భూమిలో, ప్రాజెక్టు బఫర్‌ జోన్‌లో, పశువులు నీళ్లు తాగేందుకు వెళ్లే పానాదిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ప్రభుత్వ నీటిపారుదల శాఖ ప్రాజెక్టులు ప్రైవేటు వ్యక్తులు తమ ఆధీనంలోకి తీసుకుని తమ కార్యకలాపాలకు అడ్డాలుగా మార్చుకున్నారు. అడ్డుకోవాల్సిన రెవెన్యూ, పోలీసులు, నీటిపారుదల, పంచాయతీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

కాలం చెల్లిన బోట్లను నడుపుతూ..

సర్పన్‌పల్లి ప్రాజెక్టులో ఎలాంటి అనుమతులు లేకుండా బోటింగ్‌ నిర్వహిస్తూ పర్యాటకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా ప్రజలను ప్రాజెక్టులోకి తీసుకెళ్తున్నారు. కాలం చెల్లిన బోట్లను నడుపుతున్నట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టు పరిసరాల్లో ఇప్పటి వరకు మూడు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇక్కడి రిసార్ట్‌లో అడ్వెంచర్‌ గేమ్‌ ఆడుతూ బావిలో మునిగి ఓ వ్యక్తి మృతి చెందాడు. కారు నడుపుతూ బోల్తాపడి మరో వ్యక్తి మృతి చెందాడు. బోటు బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. వరుస ఘటనలు జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. సాధారణంగా రిసార్ట్‌ ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వం నుంచి 11 రకాల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఏ ఒక్క అనుమతి కూడా లేకుండానే రిసార్ట్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. కోట్‌పల్లి, సర్పన్‌పల్లిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారు.

ప్రాజెక్టుల్లో నిబంధనలకు విరుద్ధంగా బోటింగ్‌

అధికారులకు తెలిసినా..

రిసార్ట్స్‌లో జరిగే కార్యకలాపాలు అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. తనిఖీల సమయంలో అక్రమమని తేల్చిన వారే నెల తిరక్కుండానే సక్రమమంటున్నారు. జిల్లా కేంద్రం.. అనంతగిరి ఫారెస్టుకు ఆనుకొని అక్రమంగా ఏర్పాటు చేసిన రిసార్ట్స్‌ విషయంలో జిల్లా అధికారులు వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. అనుమతులు లేవని సీజ్‌ చేశారు. కానీ నెల తిరక్కుండానే నిర్వాహకులు తిరిగి ప్రారంభించడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. గత ప్రభుత్వ హయాంలో జిల్లా కు చెందిన ఓ ప్రజాప్రతినిధి అండదండలతో ఈ రిసార్ట్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి అండదండలున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికై నా జిల్లా అధికారులు రిసార్ట్స్‌పై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement