హస్తంలో అసమ్మతి రాగం! | - | Sakshi
Sakshi News home page

హస్తంలో అసమ్మతి రాగం!

Jul 16 2026 7:24 AM | Updated on Jul 16 2026 7:24 AM

● ఎమ్మెల్యే తీరుపై మండల నేతల పెదవి విరుపు ● నావంద్గీ సొసైటీ చైర్మన్‌ ఎంపికపై అసంతృప్తి ● జీవన్గీలో సమావేశమై మంతనాలు

బషీరాబాద్‌: అధికార పార్టీలో అసమ్మతి రాగం బహిర్గతమైంది. నావంద్గీ రైతు సహకార సంఘం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్ల ఎంపికను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి ఏకపక్షంగా నిర్ణయించారంటూ మండలంలోని పలువురు ముఖ్య నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం జీవన్గీలో సమావేశమైన సుదీర్ఘంగా చర్చించారు. పార్టీలో సీనియర్‌ నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా పదవులు కట్టబెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేకు సన్నిహితంగా భావించే నాయకులే అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. రెండుసార్లు సొసైటీ వైస్‌ చైర్మన్‌గా పనిచేసిన అజయ్‌ప్రసాద్‌కే మళ్లీ పదవి ఇస్తున్నారనే విషయంపై ఆత్మకమిటీ నియోజకవర్గ చైర్మన్‌ శంకర్‌రెడ్డి, ప్రస్తుత సొసైటీ చైర్మన్‌ వెంకట్‌రామ్‌రెడ్డి, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్లు మాధవరెడ్డి, బాస్పల్లి శ్రీనివాస్‌రెడ్డి, బషీరాబాద్‌ సర్పంచ్‌ వెంకటేష్‌ మహారాజ్‌, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు సుధాకర్‌రెడ్డి, మాణిక్‌రెడ్డి, బిచ్చిరెడ్డి, పవన్‌ ఠాకూర్‌, సాయిలుగౌడ్‌ తదితరులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అజయ్‌ప్రసాద్‌ భార్య రెండుసార్లు ఎంపీపీగా పనిచేశారని ప్రతీసారీ ఒక్కరికే పదువులు ఇవ్వడం ఏమిటనే చర్చసాగింది. ఇప్పటికే ఇతర పదవులన్నీ రిజర్వేషన్ల పరిధిలోకి వెళ్లాయని, రిజర్వేషన్‌ లేని సొసైటీ చైర్మన్‌ పదవిని కూడా బీసీ సామాజిక వర్గానికి కేటాయిస్తే తమకు రాజకీయంగా అన్యాయం జరుగుతుందని నాయకులు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ పదవికి సీనియర్‌ నాయకులు మాధవరెడ్డి లేదా శ్రీనివాస్‌రెడ్డిలలో ఒకరిని నియమించాలని సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలిసింది. ఇదే విషయమై త్వరలో ఎమ్మెల్యేను కలిసి తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఒకవేళ అజయ్‌ప్రసాద్‌ను చైర్మన్‌గా నియమిస్తే తదుపరి కార్యాచరణపై అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో చర్చించినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement