అదనపు కలెక్టర్ వెంకటాచారి
కొడంగల్: పట్టణ పరిధిలో ప్రధాన రహదారి విస్తరణ పనుల కారణంగా నిర్మా ణాలు కోల్పోతున్న వారందరికీ న్యాయం చేస్తామని అదనపు కలెక్టర్ వెంకటాచారి అన్నారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వాసితులతో సమావేశమయ్యారు. భూ సేకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. లాహోటీ కాలనీ నుంచి వినాయక చౌరస్తా మీదుగా మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం, బాపల్లి రోడ్డు జంక్షన్ వరకు ఉన్న 187 మందికి చెందిన స్థలాలు, నిర్మాణాలు రోడ్డు విస్తరణ కోసం తీసుకోవాలని అధికారులు నోటీఫికేషన్ ఇచ్చారు. ఇండ్లు, నిర్మాణాలు కోల్పోతున్న వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు పరిహారం చెల్లిస్తామని అధికారులు తెలిపారు. పట్టణ ప్రధాన రహదారి విస్తరణ వల్ల రవాణా సౌకర్యం మెరుగు పడుతుందని, పట్టణం అభివృద్ధి చెందుతుందని అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పూర్తిగా ఇండ్లు కోల్పోతున్న వారు తమకు పునరావాసం కల్పించాలని అధికారులను కోరారు. మరి కొందరు 60 ఫీట్లు కాకుండా రోడ్డు విస్తీర్ణం కొంత మేరకు తగ్గించాలన్నారు. మార్కెట్ రేటు ప్రకారం పరిహారం చెల్లిస్తే తమకు న్యాయం జరుగుతుందని పలువురు బాధితులు అధికారులను కోరారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ గుప్తా, కమిషనర్ బలరాం నాయక్, మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, తహసీల్దార్ రాంబాబు, కౌన్సిలర్లు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
‘లక్ష్మీదేవిపల్లి’ పరిహారం తేల్చండి
● అప్పటివరకు సర్వే చేపట్టొద్దు
● అధికారులను అడ్డుకున్న పద్మారం గ్రామస్తులు
కొందుర్గు: లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని స్వాగతిస్తున్నామని.. కానీ ప్రాజెక్ట్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ఇచ్చే పరిహారంపై స్పష్టత ఇవ్వాలని జిల్లేడ్‌చౌదరిగూడ మండలం పద్మారం గ్రామస్తులు డిమాండ్ చేశారు. బుధవారం భూముల సర్వేకు వెళ్లిన అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభివృద్ధిని అడ్డుకోం కానీ భూములు కోల్పోతున్న రైతులకు మరొక చోట భూములు ఇస్తారా..? ప్లాట్లు కేటాయిస్తారా..? లేదంటే ఎకరాకు ఎంత పరిహారం అందజేస్తారో తేల్చాలని డిమాండ్ చేశారు. న్యాయపరిహారం ప్రకటించే వరకు భూ సర్వే చేపట్టనీయమని తేల్చిచెప్పారు. దీంతో అధికారులు చేసేదేమీ లేక పనులు నిలిపివేసి వెనుదిరిగారు. సర్వేకు వెళ్లిన వారిలో తహసీల్దార్ జగదీశ్వర్, ఎంఆర్‌ఐ మహేందర్ గౌడ్, ఇరిగేషన్, సర్వే అధికారులు ఉన్నారు.


