అనంతగిరి: వికారాబాద్ సురక్ష మిత్ర కార్యక్రమం ద్వారా డ్రగ్స్ నిర్మూలన, సైబర్ నేరాల నివారణ, మహిళా శిశు భద్రత, రోడ్డు భద్రతపై గ్రామాలు, పాఠశాలలు, కళాశాలల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ స్నేహమెహ్ర సూచించారు. బుధవారం వికారాబాద్‌లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులపై ఆరా తీశారు. దర్యాప్తుతో వేగం పెంచాలన్నారు. ఫోరెన్సిక్ నివేదికలు, సీసీ టీవీ ఫుటేజీ, డిజిటల్ సాక్ష్యాలు, సాంకేతిక విశ్లేషణ వంటి ఆధునిక దర్యాప్తు పద్ధతులను వినియోగించి బలమైన సాక్ష్యాధారాలతో కేసులను కోర్టులో ప్రవేశపెట్టాలని సూచించారు. పెండింగ్ కేసుల్లో నిందితులను త్వరగా అరెస్ట్ చేసి, లాంగ్ పెండింగ్ కేసులను ప్రత్యేక కార్యాచరణతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. బాణామతి, చేతబడి వంటి చట్టవిరుద్ధ చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంకులు, ఏటీఎంలు, బంగారం దుకాణాలు, రద్దీ ప్రాంతాల్లో నిఘా పెంచి ఆస్తి సంబంధిత నేరాలను అరికట్టాలన్నారు. పొలాల చుట్టూ రైతులు రక్షణ కోసం ఏర్పాటు చేసే విద్యుత్ తీగల కారణంగా మానవ, వన్యప్రాణులకు ప్రమాదం ఏర్పడుతోందని అలాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పీడీఎస్ బియ్యం, గంజాయి, మాదకద్రవ్యాలు, అక్రమ ఇసుక రవాణా, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ లోడ్ వాహనాలపై నిఘా పెట్టాలని తెలిపారు. సమావేశంలో డీఎస్పీలు శ్రీనివాస్, జానయ్య, అంజయ్య, యాదయ్య, శ్రీనివాస్, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.


