ఫేక్‌ ఆధార్‌తో స్థలం కాజేసే కుట్ర | - | Sakshi
Sakshi News home page

ఫేక్‌ ఆధార్‌తో స్థలం కాజేసే కుట్ర

May 16 2025 7:10 AM | Updated on May 16 2025 7:10 AM

ఫేక్‌ ఆధార్‌తో స్థలం కాజేసే కుట్ర

ఫేక్‌ ఆధార్‌తో స్థలం కాజేసే కుట్ర

అబ్దుల్లాపూర్‌మెట్‌: చనిపోయిన వ్యక్తి స్థానంలో వేరొకరిని చూపించి.. నకిలీ ఆధార్‌ కార్డును సృష్టించిన కేటుగాళ్లు ఓ ప్లాటును తమ పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు కుట్ర పన్నారు. ఆధార్‌ కార్డుపై మార్ఫింగ్‌ చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు వచ్చిన ముఠా సభ్యుల తీరుపై అనుమానం వచ్చిన సబ్‌ రిజిస్ట్రార్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అదుపులోకి తీసుకున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని గోషామహల్‌కు చెందిన చంద్రకాంత్‌కు మండల పరిధిలోని మజీద్‌పూర్‌లో ఉన్న 267 గజాల స్థలాన్ని మనకర్‌ ఆనంద్‌ జీపీఏ(866/2013) చేయించుకున్నాడు. కొన్ని నెలలకే ఆనంద్‌ మృతి చెందాడు. ఈ విషయాన్ని గుర్తించి ఆ స్థలాన్ని కాజేయాలని చంపాపేటలో నివాసముండే కొసిరెడ్డి భాస్కర్‌రెడ్డి(సస్పెండ్‌కు గురైన ఆర్టీసీ ఉద్యోగి) పన్నాగం వేశాడు. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా గోనకోల్కు చెందిన బోదాసు ఆంజనేయులును ప్లాట్‌ యజమాని ఆనంద్‌గా చూపించేందుకు నకిలీ ఆధార్‌ కార్డు సృష్టించాడు. అదే సమయంలో వరంగల్‌లోని బలపాలకు చెందిన జిల్లాపల్లి సంజీవరావును చంద్రకాంత్‌గా చూపించేలా మరో ఆధార్‌ కార్డును తయారు చేశాడు. సాక్షులుగా గోనకోల్క చెందిన దండుగల ఆంజనేయులు, చంపాపేట్‌లో ఉంటున్న కురువ శ్రీనివాసులును తీసుకెళ్లాడు. వీరందరి నుంచి భాస్కర్‌రెడ్డి కొనుగోలు చేస్తున్నట్టు డాక్యుమెంట్‌ రైటర్‌ ఉదయ్‌కుమార్‌తో పత్రాలు సిద్ధం చేసుకున్నాడు. బుధవారం రిజిస్ట్రేషన్‌ చేసుకునే సమయానికి ఆధార్‌ కార్డుల నంబర్లు నమోదు చేసే సమయంలో బయోమెట్రిక్‌లో అసలు, నకిలీ వ్యక్తులకు సరి తూగలేదు. బయోమెట్రిక్‌ సమయంలో ఆనంద్‌ పేరుతో ఉన్న ఆధార్‌ కార్డు నంబరు నమోదు చేయగా ఆంజనేయులు పేరు. చంద్రకాంత్‌ పేరిట ఉన్న ఆధార్‌ కార్డును నమోదు చేయగా సంజీవ పేర్లు రావడంతో సబ్‌రిజిస్ట్రార్‌ సునీతా రాణి అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్‌ రెడ్డి తెలిపారు. నిందితులు భాస్కర్‌రెడ్డి, శ్రీనివాసులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతావారు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపడుతున్నట్లు వివరించారు.

సబ్‌రిజిస్ట్రార్‌ ఫిర్యాదుతో భగ్నం

పోలీసుల అదుపులో నిందితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement