హానికర ఫ్యాక్టరీలు మాకొద్దు
మోమిన్‌పేట: ప్రజల ప్రాణాలకు హాని కలిగించే ఏ ఫ్యాక్టరీ మాకొద్దని ప్రజలు ముక్త కంఠంతో పేర్కొ న్నారు. మంగళవారం మోమిన్‌పేటలో సువీర బయో ఫ్యూయల్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ సుధీర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మాజీ సర్పంచులు, ప్రస్తుత సర్పంచులు, పర్యావరణ ప్రేమికులు, సామాజిక కార్యకర్తలు మాట్లాడారు. పరిశ్రమలో ఉత్పత్తయ్యే ఇథనాల్‌తో వాతావరణం, భూగర్భ జలాలు కలుషితం అవుతాయని పేర్కొన్నారు. క్యాన్సర్ వచ్చే ముప్పు ఉందన్నారు. ఇలాంటి పరిశ్రమలతో రైతులు, నిరుద్యోగులకు ప్రయోజనం లేదన్నారు. తమను కాదని ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ప్రజలకు ఉపాధినిచ్చే పరిశ్రమలు నెలకొల్పితే తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ప్రజలకు ఇష్టం లేనప్పుడు తాము పరిశ్రమను ఏర్పాటు చేయబోమని ఫ్యాక్టరీ డైరెక్టర్ బుచ్చిబాబు చెప్పడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ వాసుచంద్ర తదితరులు పాల్గొన్నారు.


