మహిళా రక్షణకు పటిష్ట చట్టాలు
అనంతగిరి: మహిళల రక్షణకు ప్రభుత్వం పటిష్టమైన చట్టాలు తీసుకువచ్చిందని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో లైంగిక వేధింపుల చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు ఉద్యోగ భద్రత కల్పించేలా చేయడం.. పని ప్రదేశంలో భద్రత, న్యాయం అందించడం కోసం ప్రభుత్వం ఈ చట్టం రూపొందించిందన్నారు. పది లేక అంతకన్నా ఎక్కువ మంది మహిళా ఉద్యోగులు పనిచేసే ప్రతి కార్యాలయంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, ఇన్‌చార్జ్ అడిషనల్ కలెక్టర్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు .
యూరియా కొరత లేదు
జిల్లాలో యూరియా కొరత లేదని కలెక్టర్ ప్రతీక్ జై న్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 4,026 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందన్నా రు. డీలర్ల వద్ద 1,432 మెట్రిక్ టన్నులు, సహకార సంఘాల వద్ద 342 మెట్రిక్ టన్నులు, మార్క్ ఫెడ్ గోదాముల్లో 2,252 మెట్రిక్ టన్నులు నిల్వ ఉందని తెలిపారు. జనవరి మాసానికి గాను 1,922 మెట్రి టన్నుల యూరియా అవసరమని, అందుకు తగ్గ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిప్పారు.
సత్వరం పరిష్కరించాలి
ప్రజావాణి అర్జీలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 75 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర, డీఆర్‌ఓ మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.


