వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు
కొడంగల్ రూరల్: వైకుంఠ ఏకాదశిని పురష్కరించుకొని పట్టణంలోని మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ పురోహితులు, ధర్మకర్తలు తెలిపారు. తెల్లవారుజామున 4గంటలకు వాయి ధ్యం, 5గంటలకు సుప్రభాత సేవ, 5.30గంటలకు శ్రీమాన్ ధరూరి శ్రీనివాసాచార్యుల వారిచే తిరుప్పావై పారాయణం, ప్రవచనాలు ఉంటాయని తెలిపారు. శ్రీమన్నారాయణుడు లోక కళ్యాణార్థం యోగనిద్ర నుంచి మేల్కొనే పవిత్ర దినమే వైకుంఠ ఏకాదశిగా పురాణహితోక్తి అని, ముక్కోటి దేవతలు స్వామివారిని దర్శించుకునే పవిత్రమైన రోజును ముక్కోటి ఏకాదశిగా నామకరణం చేశారని తెలిపారు. తిరుపతి శ్రీరంగాధి దివ్యక్షేత్రాల్లో వైకుంఠ ద్వార దర్శన ఉత్సవం జరుపుకొంటారని, ఇదే సంప్రదాయాన్ని కొడంగల్ ఆలయంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ధర్మకర్తలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల్లో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల పెద్ద సంఖ్యలో వచ్చే అవకావం ఉండటంతో అందుకు తగ్గ చర్యలు తీసుకున్నారు.


