నడి రోడ్డుపై మృత్యుపాశాలు!
తాండూరు పట్టణంలోని అంతారం మార్గంలో 6 నెలల క్రితం రోడ్డుపై నిలిచి ఉన్న లారీపై విద్యుత్ తీగ తెగి పడటంతో పూర్తిగా దగ్ధమైంది. మరో ఘటనలో చించోళి మార్గంలోని శివాజీ చౌక్ వద్ద వేగంగా వచ్చిన లారీ ట్రాన్స్‌ఫార్మర్ దిమ్మెను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరుపాదదారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇలాంటి సంఘటనలు తాండూరులో నిత్యకృత్యంగా మారాయి. ప్రధాన రోడ్డును విస్తరించినా విద్యుత్ స్తంభాలను తొలగించకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
తాండూరు: పట్టణంలోని ప్రధాన జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టినా విద్యుత్ స్తంభాలను తొలగించలేదు. దీంతో నాలుగేళ్లుగా ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నడి రోడ్డుపైనే ట్రాన్స్‌ఫార్మర్లు ఉండటంతో రెండుసార్లు వాటి దిమ్మెలను వాహనాలు ఢీకొన్నాయి. మరోవైపు మున్సిపల్ పరిధిలోని శివాజీ చౌక్ నుంచి సీతారాంపేట్ పాండురంగ స్వామి దేవాలయం వరకు మార్గంలో నడిరోడ్డుపై విద్యుత్ స్తంభాలు ఉన్నాయి. పాత తాండూరు ప్రాంతంలోనూ అదే పరిస్థితి నెలకొంది.
రూ.1.92 కోట్లతో ప్రతిపాదనలు
తాండూరు మున్సిపల్ పరిధిలో ప్రధాన రోడ్లపై ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి మరోచోట నాటేందుకు రూ.1.92 కోట్ల నిధులు అవసరముంది. అందుకోసం గతేడాది విద్యుత్ శాఖ సిబ్బంది ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు. శివాజీ చౌక్ నుంచి ముర్షద్ దర్గా మార్గంలో విద్యుత్ స్తంభాలను తొలగించేందుకు 30 పోల్స్ అవసరమవుతాయి. తీగలు, విద్యుత్ పరికరాలకు మొత్తం కలిపి రూ.22.44 లక్షల నిధులు కావాల్సి ఉంది. అయితే ఈ రోడ్డు పురపాలక సంఘం ఆధీనంలోకి రావడంతో మున్సిపల్ అధికారులను నిధుల కోసం కోరితే వారం రోజుల క్రితం రూ.8 లక్షల నిధులను విద్యుత్ శాఖ ఖాతాలో జమ చేశారు. మరోవైపు పాత తాండూరులో రూ.1.45 కోట్లు, అంతారం రోడ్డుపై ఉన్న స్తంభాల తొలగింపునకు రూ.24.25 లక్షల నిధులు వెచ్చించాలి. ఆర్‌అండ్‌బీ శాఖ ఆఽధీనంలో ఉండటంతో నిధులను సమకూర్చాలని విద్యుత్ శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించి ఏడాది దాటినా ఎలాంటి స్పందన లేదు.
రహదారి విస్తరించినా.. తొలగించని కరెంట్ స్తంభాలు
నిధులు లేవంటూ
కాలయాపన చేస్తున్న విద్యుత్‌శాఖ
తరచూ చోటు చేసుకుంటున్న ప్రమాదాలు


