అదనపు కట్నం తేవాలంటూ భర్త, అత్త వేధింపులు.. వివాహిత తీవ్ర నిర్ణయం..

- - Sakshi

అదనపు కట్నం తేవాలంటూ భర్త, అత్త వేధింపులు..

మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు!

సాక్షి, వికారాబాద్‌: అదనపు కట్నం కోసం భర్త, అత్త పెడుతున్న వేధింపులను భరించలేని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెద్దేముల్‌ మండల పరిధిలోని గొట్లపల్లినికి చెందిన వీరమణి(30)ని మార్చి 16, 2017లో ధారూరుకి చెందిన జక్కెపల్లి లాల్‌కుమార్‌కు ఇచ్చి వివాహం చేశారు. వివాహ సమయంలో రూ.20వేల నగదు, 3 తులాల బంగారం, బడి బాసండ్లు ఇచ్చారు.

అయితే వీరమణికి.. కార్తీక్‌(6), కృతిక(3) ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇల్లు కట్టుకోడానికి అదనపు కట్నం తీసుకురావలంటూ అత్త లక్ష్మి, భర్త లాల్‌కుమార్‌ వేధించసాగారు. ఈ నేపథ్యంలో వీరమణి పుట్టింటివారు ఇంటి నిర్మాణానికి ఆగస్టు 30, 2020న రూ. 2.50 లక్షలు, 2021లో రెండోసారి రూ.3 లక్షలు ఇచ్చారు. డబ్బులు సరిపోలేవని భర్త, అత్త మరిన్ని డబ్బులు కావాలని డిమాండ్‌ చేయగా మూడు నెలల క్రితం వీరమణి అమ్మ మూడోసారి రూ.2.20 లక్షలు ఇచ్చింది.

ఈనెల 24న కూతురు, అల్లుడు కలిసి దసరా పండుగ సందర్భంగా ఇంటికి వచ్చారని అత్త లక్ష్మి(మృతురాలి అమ్మ) పేర్కొంది. కొత్తకారు తీసుకున్నా డబ్బులు తక్కువపడ్డాయి, రూ.50 వేలు కావాలని అల్లుడు లాలుకుమార్‌ అత్త, బామ్మర్ది వెంకటేశ్‌ను డిమాండు చేశాడు. ప్రస్తుతం మా దగ్గర డబ్బులు లేవని తర్వాత ఇస్తామని చెప్పడంతో కోపోద్రిక్తుడైన లాల్‌కుమార్‌ ఉన్నపలంగా భార్యను తీసుకుని ఇంటికి వచ్చేసాడు. అదేరోజు రాత్రి భర్త, అత్త కలిసి వీరమణిని డబ్బులు తేవాలంటూ హింసించారు.

వేధింపులు భరించలేని వీరమణి బుధవారం మధ్యాహ్నం చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని అదేరోజు మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్త, భర్త కలిసి తన కూతుర్ని అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా హింసించారని, ఆవేదన వ్యక్తం చేసింది. తన కూతురి భర్త, అత్తపై కఠిన చ్యలు తీసుకోవాలని పోలీసులను వేడుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసి శవానికి గురువారం పోస్టుమార్టమ్‌ చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించామని సీఐ తెలిపారు.

ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
ఇవి చదవండి: ఇద్దరితో ప్రేమాయణం.. మరో యువతితో నిశ్చితార్థం.. సినీ ఫక్కీలో పోలీస్‌ ఎంట్రీతో షాక్‌!
 

Read latest Vikarabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top