ఇద్దరితో ప్రేమాయణం.. మరో యువతితో నిశ్చితార్థం.. సినీ ఫక్కీలో పోలీస్‌ ఎంట్రీతో షాక్‌! | Sakshi
Sakshi News home page

ఇద్దరితో ప్రేమాయణం.. మరో యువతితో నిశ్చితార్థం.. సినీ ఫక్కీలో పోలీస్‌ ఎంట్రీతో షాక్‌!

Published Fri, Oct 27 2023 8:46 AM

Love With Both Engagement With Another Young Lady - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇద్దరు యువతులను మోసం చేసి మూడో యువతితో పెళ్లితంతుకు సిద్ధమైన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆ వ్యక్తి తనకు మాత్రమే సొంతమంటూ మహిళలు కేసు పెట్టిన విచిత్రమైన సంఘటన మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... ఏపీలోని రాయచోటి ప్రాంతానికి చెందిన బాబా ఫక్రుద్దీన్‌ అనే యువకుడు మాదాపూర్‌లోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తుంటాడు.

అదే ఆస్పత్రిలో పని చేసే యువతి రెండేళ్ల క్రితం అతనికి పరిచయం అయింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వెంగళరావునగర్‌ డివిజన్‌లోని ఒక బస్తీలో నివాసం ఉంటున్న యువతి రూముకు అనేకమార్లు వచ్చి తన కోర్కెను తీర్చుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆమెకు చెప్పకుండా కార్ఘానాలోని మరో ఆస్పత్రిలో చేరాడు. అక్కడ పనిచేసే ఇంకో యువతితో సేమ్‌ సీన్‌ రిపీట్‌ చేశాడు. కట్‌ చేస్తే... (ఈ నెల 6న) ఎవరికీ చెప్పకుండా స్వగ్రామం వెళ్లాడు. అక్కడ తన ఇంటి పక్కనే ఉంటున్న యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు.

ఈ నెల 24న నిశ్చితార్థం చేసుకోవాలనుకుని అనుకున్నాడు. పక్కాగా ప్లానింగ్‌ చేసి ఉంగరాలు, దండలు మార్చుకోవాలనుకునే సమయంలో సినీ ఫక్కీలో మధురానగర్‌ ఎస్‌ఐ ఇక్బాల్‌ షడన్‌గా రంగ ప్రవేశం చేశారు. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ ఆదేశాల మేరకు నిశి్చతార్థాన్ని చివరి నిమిషంలో అడ్టుకున్నాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా వారికి అతని ఫ్లాష్‌బ్యాక్‌ మొత్తం చెప్పి నిందితుడిని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. సమస్య పరిష్కారం అయిందనుకున్నారంతా... అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది.

ఫక్రుద్దీన్‌ను మధురానగర్‌కు తీసుకువచ్చారని తెలుసుకున్న బాధిత యువతులు బుధవారం రాత్రి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. అర్ధరాత్రి వరకు వీడు నా వాడు అంటే కాదు నా వాడంటూ ఇరువురు యువతులు వాదులాడుకున్నారు. దీంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. ముందుగా నేను మోసపోయాను, కాబట్టి నాకే సొంతమంటూ ఒకరు, కాదు.. నావాడంటూ మరొకరు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఇరువురూ తమ ఆవేదను తెలియజేశారు. ఈ సమస్య ఎలా పరిష్కరించాలో అర్థంకాక మధురానగర్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌తోపాటు ఎస్‌ఐ ఇక్బాల్‌ తలలు పట్టుకున్నారు. ఎట్టకేలకు ఎగ్బాల్‌ను పోలీసులు రిమాండ్‌ తరలించి ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement