నిరాడంబరతకు నిదర్శనం | - | Sakshi
Sakshi News home page

నిరాడంబరతకు నిదర్శనం

Mar 14 2026 10:26 AM | Updated on Mar 14 2026 10:26 AM

ఇబ్రహీంపట్నం: అశ్రునయనాల మధ్య ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు అంత్యక్రియలు శుక్రవారం రాత్రి ముగిశాయి. ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేని నిరాడంబర రాజకీయ జీవితానికి నిదర్శనంగా నిలిచారు కొండిగారి రాములు. భేషజాలకు తావివ్వకుండా, ప్ర జాసేవకు, సమస్యల పరిష్కరానికే జీవితాన్ని అంకితం చేశారు. పదేళ్లు ఎమ్మెల్యేగా కొనసాగినా ఆస్తులు కూడబెట్టుకోలేదు. అనారోగ్యంతో పెద్ద కుమారుడు అరుణ్‌ ఆస్పత్రిపాలైతే చికిత్స అందించేందుకు సైతం పైకంలేని పరిస్థితి ఎదుర్కొన్నారు. సొంత గూడు కట్టుకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఎమ్మెల్యేగా వచ్చే గౌరవ వేతనం పార్టీ ఫండ్‌కే ఇచ్చేశారు. అప్పట్లో ఎమ్మెల్యేలకు బంజారాహిల్స్‌లో ఇంటి స్థలాన్ని కేటాయించినా తీసుకోలేదు. కమ్యూనిస్టు నేతగా నమ్ముకున్న పార్టీ సిద్ధాంతం కోసం ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. సాదాసీదా జీవితాన్ని గడిపి ఆదర్శప్రాయంగా నిలిచారు.

రాజకీయ ప్రస్థానం

చిన్న వయస్సులోనే కమ్యూనిస్టు భావజాలంతో ఆయన స్వగ్రామమైన ఆరుట్ల నుంచి రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1967లో భూ పోరాట సమితిలో కృష్ణమూర్తి నాయకత్వలో పనిచేశారు. భూ, ప్రజా సమస్యల పోరాటాల ఫలితంగా 1989 నుంచి 2007 వరకు ఆయనపై సుమారు 50 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం నేతగా 1985–1989 వరకు పనిచేశారు. 1989 నుంచి 1999 వరకు పదేళ్ల పాటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.

దుఃఖసాగరంలో కుటుంబం

కొండిగారి రామలు ఆయన సతీమణి ముత్యాలమ్మ తొమ్మిది నెలల వ్యవధిలోనే కన్నుమూయడంతో కుటుంబసభ్యులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. చిన్న కుమారుడు త్రిలోక్‌ ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌గా విజయం సాధించాడు. బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లంతా క్యాంపులో ఉండడంతో ఆయన కూడా అక్కడే ఉన్నారు. తండ్రి అంత్యక్రియలు జరిపించేందుకు త్రి లోక్‌ రాకకోసం ఎదురుచూశారు. కుమారుడి రాకతో అంత్యక్రియలు పూర్తి చేశారు. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

మహోన్నత వ్యక్తి

కొండిగారి రాములు భౌతికకాయానికి నివాళి అర్పించిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అసెంబ్లీలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మచ్చలేని రాజకీయ నాయకుడని కొనియాడారు. ఆయన పవిత్ర ఆత్మకుశాంతి చేకూరాలని ప్రార్థించారు.

నిస్వార్థ నాయకుడు

నిస్వార్థ నాయకుడు, అందరినీ కలుపుకెళ్లే తత్వం కొండిగారి రాములుదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. పెద్ద దిక్కున్న నాయకుడుని కోల్పోవడం బాధకరమన్నారు. ఆత్మకు శాంతి కలగాలని నివాళి అర్పించారు.

నిఖార్సైన ఉద్యమ నేత

నిస్వార్థ రాజకీయాలకు నిదర్శనం, నిఖార్‌సైన కమ్యూనిస్టు ఉద్యమ నేత కొండిగారి రాములు అని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి అన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా సాధారణ జీవనం గడిపారని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం తీరనిలోటన్నారు.

నేటి యవతకు ఆదర్శం

ప్రజల కోసం నిరంతరం పోరాడిన వ్యకి కొండిగారి రాములు అని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన చేసిన సేవలను ఎన్నటికీ మరిచిపోలేమన్నారు. పేదల హక్కుల కోసం ఆయన చేసిన కృషి నేటి యువతకు ఆదర్శమన్నారు.

ప్రజాసేవకే జీవితం అంకితం

ఆదర్శంగా కొండిగారి రాములు

స్మరించుకున్న ప్రముఖులు

అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి

Advertisement
 
Advertisement
Advertisement