పంచాయతీ పోరుకు వేళాయె | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ పోరుకు వేళాయె

Nov 11 2026 12:19 AM | Updated on Nov 11 2026 12:19 AM

● 777 సర్పంచ్‌లు.. 7,210 వార్డులకు ఎన్నికలు ● మొదటి విడత 26, రెండో విడత 29న ఎన్నికలు ● 30 పంచాయతీల్లో ఎన్నికలు నిలుపుదల

తిరుపతి అర్బన్‌: జిల్లాలో పల్లె పోరుకు సన్నాహాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో జిల్లా అధికార యంత్రాంగం పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైంది. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరగనున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన నేతలు మున్సిపల్‌, పరిషత్‌ ఎన్నికల్లో అరాచకాలు, అక్రమాలు, దాడులు, దౌర్జన్యాలతో మోసపూరితంగా గెలుపు లెక్కలు చెబుతున్న తరుణంలో.. సర్పంచ్‌ ఎన్నికలైనా ప్రశాంత వాతావరణంలో జరుగుతాయా..? అనే చర్చ జోరుగా సాగుతోంది.

రెండు విడతల్లో ఎన్నికలు

తిరుపతి జిల్లా వ్యాప్తంగా రెండు విడతల్లో 777 పంచాయతీలు, 7,210 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలో మొత్తం 807 పంచాయతీలుండగా అందులో 30 పంచాయతీల్లో కోర్టు కేసుల నేపథ్యంలో ఎన్నికలు నిలుపుదల చేసినట్టు అధికారులు వెల్లడించారు.

26న మొదటి విడత ఎన్నికలు

మొదటి విడత పంచాయతీ ఎన్నికలు 18 మండలాల పరిధిలోని 415 పంచాయతీలకు, 3,776 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 195 కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 15న రిటర్నింగ్‌ అధికారి ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. నామినేషన్ల స్వీకరణకు 17 వరకు గడువు ఇచ్చారు. 18న పరిశీలన, 19న అప్పీళ్లు, 20న అప్పీళ్లకు పరిష్కారం, 21న నామినేషన్ల ఉపసంహరణ, తర్వాత అభ్యుర్థుల తుది జాబితా వెల్లడి, గుర్తుల కేటాయింపు ఉంటుంది. అనంతరం 26న పోలింగ్‌తోపాటు ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించనున్నారు. అవసరమైతే 27న రీపోలింగ్‌ నిర్వహించనున్నారు. మొదటి విడత 26న ఎన్నికలు నిర్వహించే మండలాలు చిట్వేల్‌, కోడూరు, ఓబులవారిపల్లి, పెనగలూరు, పుల్లంపేట, పుత్తూరు, వడమాలపేట, బాలాయపల్లి, డక్కిలి, వెంకటగిరి, రేణిగుంట, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, ఏర్పేడు, కె.వి.బి.పురం, నాగలాపురం, నారాయణవనం, పిచ్చాటూరు మండలాలు ఉన్నాయి.

17 మండలాల్లో 29న

రెండో విడత ఎన్నికలు

రెండో విడతగా జిల్లాలోని 17 మండలాల్లో 29న ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా 362 సర్పంచ్‌ పోస్టులకు, 3,434 వార్డు మెంబర్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు రిటర్నింగ్‌ అధికారి 18న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. నామినేషన్ల స్వీకరణకు 20 వరకు గడువు, 21న పరిశీలన, 22న అప్పీళ్లు, 23న అప్పీళ్ల పరిష్కారం, 24 ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా వెల్లడి, గుర్తుల కేటాయింపు చేయనున్నారు. 29న ఎన్నికలు నిర్వహించడంతోపాటు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన చేయనున్నారు. అవసరమైన చోట 30 రీపోలింగ్‌ నిర్వహించనున్నారు. రెండో విడత ఎన్నికలు జరగనున్న 17 మండలాలు చూస్తే.. చంద్రగిరి, చిన్నగొట్టిగల్లు, పాకాల, రామచంద్రాపురం, తిరుపతి రూరల్‌, ఎర్రావారిపాళెం, చిట్టమూరు, వాకాడు, దొరవారిసత్రం, నాయుడుపేట, ఓజిలి, పెళ్లకూరు, సూళ్లూరుపేట, తడ, బి.ఎన్‌.కండ్రిగ, సత్యవేడు, వరదయ్యపాలెంలో జరగనున్నట్టు కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement