జగనన్న సైనికుల్లా పనిచేద్దాం | - | Sakshi
Sakshi News home page

జగనన్న సైనికుల్లా పనిచేద్దాం

Nov 13 2026 8:45 AM | Updated on Nov 13 2026 8:45 AM

● పంచాయతీల్లో వందశాతం స్ట్రైక్‌ రేట్‌ సాధించుకుందాం ● దమ్ముంటే ఏకగ్రీవాలను రద్దు చేసి ఎన్నికలకు వస్తారా? ● ఒక్కటి గెలుచుకున్నా.. జెడ్పీటీసీని వదులుకుని రాజకీయ సన్యాసం చేస్తా ● కూటమి నాయకులకు కామిరెడ్డి సవాల్‌

పెళ్లకూరు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కుటుంబ సభ్యులంతా జగనన్న సైనికుల్లా పనిచేసి పంచాయతీ ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్‌రేట్‌ సాధించి పార్టీ అధినేత జగనన్నకు పెళ్లకూరు నుంచే తొలి కానుక అందిద్దామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం బెయిల్‌పై విడుదలై చిల్లకూరుకు చేరుకున్న ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. చచ్చిన శవాన్ని తీసుకొచ్చి అక్రమ కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందిన కూటమి నాయకులకు దేవుడే తగిన బుద్ధి చెబుతాడని హితవు పలికారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పెళ్లకూరు నుంచి వైఎస్సార్‌సీపీ కొట్టిన దెబ్బకు విజయవాడలో కూటమి ప్రభుత్వం దద్దరిల్లిందన్నారు.

ఈ విజయం కార్యకర్తలదే

దక్షణాది రాష్ట్రాల్లో జైల్లో ఉండి పోటీ చేసి, ఎలాంటి ప్రచారం లేకుండా, ఒక్కపైసా ఖర్చు పెట్టకుండా శ్రేయోభిలాషులంతా కలిసి భారీ మెజారిటీతో గెలిచిన ఏకై క వ్యక్తిగా చరిత్రలో నిలపడం కార్యకర్తల విజయమని ఆయన కొనియాడారు. అన్యాయంగా 19 కేసులు పెట్టి, 32 మందిని జైళ్లలో నిర్బంధించి, మరో 450 మందిపై బైండోవర్‌ కేసులు పెట్టినా జగనన్న ఇచ్చిన ధైర్యాన్ని కోల్పోకుండా ప్రతి ఒక్కరూ జగనన్న సైనికుల్లా పనిచేసి పోటీ చేసిన రెండు ఎంపీటీసీ స్థానాలు, ఒక జెడ్పీటీసీని భారీ మెజారిటీతో సాధించిన ఘనత కార్యకర్తలదేనన్నారు.

మీకు దమ్ముందా?

మండలంలో ఏకగ్రీవాలు అయిన ఎనిమిది ఎంపీటీసీ స్థానాలకు రాజీనామా చేసి ప్రజాస్వమ్యబద్ధంగా ఎన్నికలకు వచ్చే దమ్ముందా..? అంటూ కూటమి నాయకులకు కామిరెడ్డి సవాల్‌ విసిరారు. ఎనిమిది ఎంపీటీసీ స్థానాల్లో ఒక్కటి కూటమి గెలుచుకున్నా... గెలిచిన జెడ్పీటీసీకి రాజీనామ చేస్తానని చెప్పారు. పెళ్లకూరు వైఎస్సార్‌ సీపీ శ్రేణుల గుండైధెర్యం జగనన్న అంటూ గుర్తుచేశారు. వైఎస్సార్‌సీపీ విజయానికి దోహదపడిన ప్రతిఒక్కరికు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కలవకూరు ఎంపీటీసీగా గెలుపొందిన బండి బాలచంద్ర గజమాలతో కామిరెడ్డిని సన్మానించారు. పార్టీ మండల అధ్యక్షుడు వెంకటరత్నం, పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి వినోద్‌రెడ్డి, మోహన్‌, రఘునాయుడు, హరిరెడ్డి, పట్టాభిరెడ్డి, మునిరాజా, జితేంద్ర, బాలచంద్ర, గిరిరెడ్డి, రాజారెడ్డి, సతీష్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, సురేష్‌, వీరకుమార్‌, మధుసూదన్‌నాయుడు, కోటి, గురవయ్య బాలాజీ పాల్గొన్నారు.

చెల్లింపులు తప్పనిసరి

అధికార పార్టీకి చెందిన ఓ వలస పక్షి రూ.4,300 కోట్ల మేర బ్యాంకులను లూటీ చేసి, నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబుతో కలిసి అక్రమ కేసులు పెట్టించి అన్యాయంగా 180 రోజులు జైల్లో పెట్టారని ఆరోపించారు. వీరందరికి జగనన్న 2.0లో తిరిగి చెల్లింపులు కచ్చితంగా ఉంటాయన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన ఎన్నికలను ఎస్సై ఆదిలక్ష్మి, సీఐ సంఘమేశ్వరరావు ఆధ్వర్యంలో కూటమి రౌడీలంతా కలిసి ఎనిమిది ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డగించి, నామినేషన్‌ పత్రాలు చించివేసి ఏకగ్రీవాలను చేసుకోవడం సిగ్గుచేటన్నారు. పోటీ చేసిన మూడు చోట్ల భారీ ఆధిక్యంతో గెలిచిన విషయాన్ని గుర్తుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement