తిరుమల: టీటీడీ అభిప్రాయ సేకరణ వ్యవస్థ పనితీరు, భక్తుల నుంచి అందుతున్న అభిప్రాయాలు, ఫిర్యాదుల పరిష్కారంపై బుధవారం ఉదయం టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుమలలోని పద్మావతీ అతిథి గృహంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు టీటీడీ సేవలపై భక్తుల అభిప్రాయాలను ఎప్పటికప్పుడు సేకరించి, వాటి ఆధారంగా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అన్నప్రసాదం కేంద్రంలో భక్తులకు అవసరమైన సమాచారం అందించేందుకు రిసెప్షన్ కౌంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. నీటి పొదుపు, విద్యుత్ పొదుపుపై భక్తులకు అవగాహన కల్పిస్తూ, వనరులు వృధా కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వసతి సముదాయాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలతో పాటు పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నందకం యాప్ పనితీరును నిరంతరం పర్యవేక్షించాలన్నారు. యాప్‌లో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే 24 గంటల్లోపు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లగేజీ కౌంటర్ల వద్ద భక్తుల భద్రత, సౌకర్యాల దష్ట్యా సీసీటీవీ కెమెరాలు, ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.


