తిరుపతి సిటీ : ఏపీ ఎడ్‌సెట్–2026లో భాగంగా బీఈడీ, స్పెషల్ బీఈడీ కోర్సులలో రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియ గురువారం నుంచి ఈనెల 14 వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ మేరకు ఎడ్‌సెట్ కన్వీనర్ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.
మౌలానా సేవలు మరువలేం
తిరుపతి అర్బన్ : విద్యాభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువలేమని కలెక్టర్ వెంకటేశ్వర్ కొనియాడారు. బుధవారం కలెక్టరేట్‌లో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ దేశ సమైక్యత, మత సామరస్యానికి మౌలానా ఎంతో కృషి చేశారని తెలిపారు. విద్య ద్వారానే సమాజ అభివృద్ధి, దేశ ప్రగతి సాధ్యమనే ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
తిరుపతి క్రైమ్ : స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని ఎస్పీ సుబ్బరాయుడు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అడిషనల్ ఎస్పీలు శ్రీనివాసులు, శ్రీనివాసరావు , ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఆర్‌ఐ నాగభూషణం పాల్గొన్నారు.
మధుమేహంపై
పరిశోధనలు అవసరం
తిరుపతి తుడా : మధుమేహం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యానికి పెను సవాలుగా మారిందని, వ్యాధి నియంత్రణతో పాటు ఉపశమనం కలిగించే పరిశోధనలు అవసరమని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ జగదీష్ తెలిపారు. స్విమ్స్ ఆధ్వర్యంలో బుధవారం పద్మావతి ఆడిటోరియంలో 6వ డాక్టర్ బి.నాగన్న బయోకెమిస్ట్రీ చైర్ ఒరేషన్‌ను నిర్వహించారు. జగదీష్ మాట్లాడుతూ జీవనశైలిలో మార్పులు, సమతుల ఆహారం, వ్యాయామం, నిరంతర వైద్య పర్యవేక్షణతో మధుమేహ సమస్యలను అధిగమించవచ్చని తెలిపారు. ప్రొఫెసర్ డాక్టర్ అపర్ణ ఆర్ బిట్ల మాట్లాడుతూ దివంగత డాక్టర్ బి.నాగన్న కుటుంబ సభ్యుల సహకారంతో 2014లో ఈ చైర్ ఒరేషన్‌ను స్థాపించినట్లు తెలిపారు. అనంతరం డాక్టర్ బి.నాగన్న బయోకెమిస్ట్రీ ఒరేషన్ పురస్కార గ్రహీత డాక్టర్ ఎస్.సేతుపతికి అవార్డు బహూకరించారు.


