శ్రీసిటీ(వరదయ్యపాళెం): జపాన్‌కు చెందిన ప్రముఖ స్టీల్ ప్లేట్ల ప్రాసెసింగ్ సంస్థ ఇండియా మెటల్ వన్ స్టీల్ ప్లేట్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎంఓపీ) శ్రీసిటీలో తన రెండో ప్లాంట్‌ను బుధవారం ప్రారంభించింది. ఐఎంఓపీ సంస్థ 2012 ఆగస్టులో తొలిసారి కార్యకలాపాలు మొదలుపెట్టింది. 2019లో తొలిసారి విస్తరణ చేపట్టిన సంస్థ, ఇప్పుడు రెండో దశ విస్తరణతో మరో ముందడుగు వేసింది. ఈ ప్లాంట్ కోసం ఏకంగా రూ.108 కోట్లు పెట్టుబడి పెట్టింది. దీంతో శ్రీసిటీలో ఐఎంవోపీ మొత్తం పెట్టుబడులు రూ.408 కోట్లకు చేరుకున్నాయి. 12వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో అత్యాధునిక సాంకేతికతతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ విస్తరణతో సంస్థ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 48 వేల మెట్రిక్ టన్నుల నుంచి 60వేల మెట్రిక్ టన్నులకు పెరగనుంది. అదనంగా 200 మందికి నేరుగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. దీంతో శ్రీసిటీలోని ఐఎంఓపీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 850కి చేరనుంది. ఐఎంఓపీ మేనేజింగ్ డైరెక్టర్ తైజో ఇవామీ మాట్లాడుతూ కొత్త ప్లాంట్ ద్వారా మరింత నాణ్యమైన ఉత్పత్తులను అందించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రీసిటీ ఎంఈ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ ఐఎంఓపీ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. అనంతరం సంస్థ అభివృద్ధికి సహకరిస్తున్న వ్యాపార భాగస్వాములకు తైజో ఇవామి ప్రశంసా పురస్కారాలను అందజేశారు. మెటల్ వన్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సీఓఓ మసాషి మిజునో, మెటల్ వన్ ఇండియా చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ యుకితా సాటో పాల్గొన్నారు.


