సమర్థవంతంగా రీసర్వే | - | Sakshi
Sakshi News home page

సమర్థవంతంగా రీసర్వే

Nov 12 2026 5:24 AM | Updated on Nov 12 2026 5:24 AM

తిరుపతి అర్బన్‌: భూముల రీసర్వేను సమర్థవంతంగా పూర్తి చేయాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి ఆదేశించారు. బుధవారం ఏపీ సచివాలయం నుంచి ఆమె వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా అధికారులతో సమీక్షించారు. కలెక్టరేట్‌ నుంచి జేసీ గోవిందరావు, డీఆర్‌ఓ నరసింహులు పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ భూపరిపాలన, రెవెన్యూలకు సంబంధించి 22 ఏ, వెబ్‌ ల్యాండ్‌, రీ సర్వే, మాన్యువల్‌ రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్‌, ఐవీఆర్‌ఎస్‌ తదితర అంశాలపై దిశా నిర్దేశం చేశారు. జేసీ మాట్లాడుతూ వెబ్‌ ల్యాండింగ్‌కు సంబంధించి ప్రక్రియ వేగవంతం చేశామని, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీకి 38 సైకిల్స్‌ ఇప్పటికే పూర్తయ్యాయని, మరో 37 పనులు పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, మొత్తం 75 పనులు పూర్తి చేసేందుకు లక్ష్యం నిర్దేశించుకున్నామని వివరించారు. ఆర్‌డీఓలు రామ్మోహన్‌, దేవేందర్‌ రెడ్డి, భాను ప్రకాష్‌ రెడ్డి పాల్గొన్నారు.

స్టేట్‌ మాక్‌ అసెంబ్లీకి పాపానాయుడుపేట విద్యార్థినులు

ఏర్పేడు : మండలంలోని పాపానాయుడు పేట జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి మాక్‌ అసెంబ్లీ పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం మారయ్య తెలిపారు. విద్యార్థినులు సి.కుమారి, ఏ. లిఖిత, కే.హేమాశ్రీ ఈనెల 26న అమరావతిలో జరిగే స్టేట్‌ లెవెల్‌ స్టూడెంట్‌ మాక్‌ అసెంబ్లీ పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చిన టీచర్‌ స్వప్నని అభినందించారు.

మైనర్‌ వివాహంపై కేసు

సైదాపురం: మండలంలోని తూర్పువీధికి చెందిన బాలికను కూరాకు ప్రశాంత్‌ ప్రేమ పేరుతో తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడని ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగమల్లేశ్వరరావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఈఘటనలో ప్రధాన నిందితుడుతో పాటు వివాహానికి సహకరించిన కొంత మందిపై కేసును నమోదు చేశామని వెల్లడించారు.

కర్ణాటక మద్యం విక్రేతల అరెస్ట్‌

తిరుపతి క్రైమ్‌ : కర్ణాటక నుంచి మద్యం తీసుకువచ్చి తిరుపతిలో విక్రయించేందుకు యత్నిస్తున్న ముగ్గురిని ఈస్ట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 60 టెట్రా ప్యాకెట్లతో పాటు అక్ర మ రవాణాకు ఉపయోగించిన యమహా బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. తిరుపతి గ్రూప్స్‌ థియేటర్‌ సమీపంలోని పార్కింగ్‌ స్థలంలో బుధవారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ణాటక మద్యంతో నిందితులు పట్టుబడ్డారు.

వ్యక్తిపై ఇనుప రాడ్‌తో దాడి

తిరుపతి క్రైమ్‌: చిన్నపాటి వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తిపై ఇనుప రాడ్‌తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన తిరుపతిలో జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈస్ట్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాలు.. రైల్వే కోడూరుకు చెందిన ఎం.శివసారధి (28) బుధవారం మధ్యాహ్నం తిరుపతి సంధ్య థియేటర్‌ సమీపంలోని శ్రీ మంజునాథ హోటల్‌ పక్కన ఉన్న బడ్డీ కొట్టు వద్ద స్నాక్స్‌, వాటర్‌ బాటిల్‌ కొనుగోలు చేస్తుండగా వివాదం తలెత్తింది. ఈ క్రమంలో పఠాన్‌ సాధిక్‌ అనే వ్యక్తి శివసారధిపై ఇనుప రాడ్‌తో దాడి చేశాడు. దీంతో బాధితుడి తల, చేయి, నడుము భాగాల్లో గాయాలయ్యాయి. బాధితుడి కేకలు విన్న స్థానికులు రావడంతో నిందితుడు పరారయ్యాడు.బాధితుడు తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స పొందాడు. అనంతరం ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌న్‌లో ఫిర్యాదు చేశాడు.

అధికంగా మద్యం తాగి

వ్యక్తి మృతి

సత్యవేడు: మండలంలోని దాసుకుప్పం పంచాయతీలోని ఓ వైన్‌షాపు వద్ద అతిగా మద్యం తాగి ఎం.దేవరాజ్‌(40) అనే వ్యక్తి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. తమిళనాడుకు చెందిన దేవరాజ్‌ తిరువళ్లూరులో లారీ మెకానిక్‌గా జీవనం సాగిస్తున్నాడు. నాలుగేళ్ల కిత్రం అతడి భార్య విడిపోయి మరొకరిని వివాహం చేసుకుంది. అప్పటి నుంచి మద్యానికి బానిసగా మారిన దేవరాజ్‌ ఈ నెల 10వ తేదీన దాసుకుప్పం వచ్చాడు. వైన్‌షాపు వెనుక కూర్చుని మద్యం తాగి పడిపోయాడు. బుధవారం ఉదయం దుర్వాసన వస్తుండడంతో మృతదేహాన్ని గుర్తించారు. ఆధార్‌ కార్డు ఆధారంగా బంధువలకు సమాచారం ఇచ్చారు. వైద్యులు పోస్టుమార్ట నిర్వహించి మృతదేహాన్ని అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

విద్యుదాఘాతంతో ఆవు మృతి

తిరుపతి రూరల్‌ : మండలంలోని చెరువు ముందరపల్లెలో బుధవారం విద్యుదాఘాతంతో ఓ ఆవు మృతి చెందింది. వివరాలు.. గ్రామానికి చెందిన అనసూయమ్మ అనే పాడి రైతు ఆవులను మేపుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో మేత కోసం ఆవులను పొలాలకు తీసుకెళుతుండగా ట్రాన్స్‌ఫార్మర్‌ దగ్గకు వెళ్లిన ఓ ఆవుకు కరెంట్‌ షాక్‌ తగిలి మరణించింది. ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడంతోనే ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బాధితురాలు అనసూయమ్మకు ప్రభుత్వం తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement