జెన్‌జెడ్ ర్యాలీతో కూటమి తర్జనభర్జన
ఆగమేఘాల మీద ప్రెస్‌మీట్ నిర్వహణ
తిరుపతిలోనే నైలెట్ అంటూ బుకాయింపు
నైలెట్ డీమ్డ్ యూనిర్సిటీపై స్పష్టత ఇవ్వాలి : ఎంపీ
●
తిరుపతి సిటీ: తిరుపతి నుంచి నైలెట్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్‌ను అమరావతికి తరలిస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఎస్వీయూ వద్ద జెన్‌జెడ్ భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీలకతీతంగా యువత, స్థానికులు, విద్యార్థి, యుజవన సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. దీంతో ప్రభుత్వం తర్జన భర్జనలో పడింది. ఆగమేఘాల మీద నైలెట్ తాత్కాలిక క్యాంపస్ డైరెక్టర్‌తో ప్రెస్‌మీట్ పెట్టించి వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది.
అబ్బే...అదేం లేదు!
తిరుపతి నైలిట్ కేంద్రం తరలింపు అపోహ మాత్రమేనని.. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎస్వీయూలోని నైలెట్ కార్యాలయ డైరెక్టర్ శశికుమార్ తెలిపారు. శనివారం ఆయన ఎస్వీయూలోని నైలెట్ క్యాంపస్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నైలెట్ శాశ్వత క్యాంపస్ కోసం స్థలం కేటాయించాలని విన్నవించామని, కుర్రకాలువ వద్ద ఉన్న స్థలం చూపించారని తెలిపారు. ఆ స్థలం పరిశీలించామని తిరుపతికి రిమోట్ ఏరియాలో ఉందని నైలెట్‌కు అంత అనువుగా లేదని తెలిపారు. ఎస్వీయూ పరిసరాలలో 5 ఎకరాలు స్థలం కేటాయించాలని విన్నవించామని, ప్రస్తుతం ఆ దిశగా అధికారులు పరిశీలిస్తున్నారని చెప్పారు. నైలిట్‌కు కేంద్రం 2024 జనవరి 4న ఆమోదం లభించిందని, నిర్వహణ బాధ్యతలను నైలిట్ చైన్నె విభాగానికి అప్పగించారన్నారు. తాత్కాలికంగా 8 వేల చ.అ.వి పదేళ్ల అగ్రిమెంట్‌తో కేంద్రం కార్యకలాపాలు ప్రారంభించిందని, మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.850.09 లక్షలు కాగా, ఇందులో మైటీ వాటా రూ.693.25 లక్షలని తెలిపారు. ఇప్పటివరకు విద్యార్థులు, నిరుద్యోగులు, అధ్యాపకులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు, పోలీసులు అధికారులకు సుమారు 4,300 మందికి పైగా వివిధ సాంకేతిక శిక్షణ కార్యక్రమాలు అందించారన్నారు. త్వరలో ఇండియా ఏఐ ల్యాబ్‌ను సైతం నైలెట్‌లో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
స్పష్టత ఏదీ?
తిరుపతి ప్రజలను, రాయలసీమ యువతను మభ్యపెట్టే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తోంది. నైలెట్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ తిరుపతిలోనే ఏర్పాటు చేస్తున్నట్లు గతంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ దిశగా తిరుపతిలో నైలెట్ ఏర్పాటుకు స్థలం కేటాయించకుండా బుకాయింపు మాటలు చెప్పడం దారుణం. అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీ అంటూ నైలెట్ డీమ్డ్ వర్సిటీకి సీఆర్‌డీఏ నుంచి 8 ఎకరాలు స్థలం కేటాయించినట్లు మంత్రి స్పష్టం చేయడం వెనుక ఆంతర్యమేమిటి. తిరుపతిలో నైలెట్ డీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటుపై స్పష్టత ఇవ్వకుండా దాటవేత ధోరణిని ప్రదర్శించడంతోనే ప్రభుత్వ వైఖరి స్పష్టమవుతోంది. – ఎం.గురుమూర్తి, ఎంపీ, తిరుపతి


