తుమ్మలగుంటలో.. విభూది వినాయకుడు | - | Sakshi
Sakshi News home page

తుమ్మలగుంటలో.. విభూది వినాయకుడు

Sep 13 2026 9:16 AM | Updated on Sep 13 2026 9:16 AM

● 11 అడుగుల ఎత్తు.. 7 అడుగుల వెడల్పుతో విగ్రహం ఏర్పాటు ● ప్రముఖ శైవక్షేత్రాల నుంచి వచ్చిన విభూదితో తయారీ ● నాలుగు రోజులుగా సాగుతున్న విగ్రహం తయారీ పనులు

తిరుపతి రూరల్‌: విభూది పరిమళం.. మంచు కొండల నడుమ గణనాథుడి దివ్యరూపం.. భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా తుమ్మలగుంటలో ఈ ఏడాది విభూది వినాయకుడు కొలువు దీరనున్నాడు. ప్రముఖ శైవక్షేత్రాల నుంచి సేకరించిన పవిత్ర విభూదిని వినాయకుని ప్రతిమ తయారీకి వినియోగిస్తున్నారు. అత్యద్భుతంగా రూపుదిద్దుకునే విభూది వినాయకున్ని చూసేందుకు భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత 15 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్‌ చెవిరెడ్డి కుటుంబీకుల సహకారంతో బాల వినాయక కమిటీ సభ్యులు విభిన్న ఆకృతులతో గణపతి ప్రతిమలను తయారు చేయించి భక్తులకు కనువిందు కలిగించడం ఆనవాయితీగా వస్తోంది. వినాయక చవితి నుంచి 9 రోజుల పాటు ప్రత్యేకంగా పూజలు చేస్తూ గణేశుని దర్శనభాగ్యం కలిగిస్తున్నారు. అంతేగాక ఆ వినాయకుని ప్రతిమ తయారీలో ఎలాంటి రసాయనాలకు తావులేకుండా మట్టి, గడ్డి, చెక్కను మాత్రమే వినియోగిస్తున్నారు. తుమ్మలగుంటలో వరుసగా ఐదేళ్లు పాటు ఏర్పాటు చేసిన వినాయకుని ప్రతిమల జాబితాను పరిశీలిస్తే పైనాపిల్‌ వినాయకుడు, నారికేళ వినాయకుడు, తమలపాకు వినాయకుడు, నెమలి పింఛ వినాయకుడు, తుంబుర వినాయకుని ప్రతిమలను భక్తులు దర్శించారు. అదే సమయంలో ఈ ఏడాది విభూది వినాయకుని ప్రతిమను తయారు చేయించి చవితి రోజున భక్తులకు దర్శనభాగ్యం కలిగించనున్నారు.

కల్యాణ మండపంలో కొలువు

ఈ ఏడాది వినాయక చవితి పర్వదినం రోజునే తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం కానున్నాయి. దీంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విభూది వినాయకుడిని ఆలయంలోని కల్యాణ మండపంలో ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు.

7 టన్నుల విభూదితో..

ప్రముఖ శైవక్షేత్రాల నుంచి సేకరించిన సుమారు 7 టన్నుల విభూదిని ఉపయోగించి 11 అడుగుల ఎత్తు, 7 అడుగుల వెడల్పుతో విభూది వినాయకుడి ప్రతిమను రూపొందిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన 16 మంది కళాకారులు వారం రోజులుగా విగ్రహ తయారీలో నిమగ్నమయ్యారు. మంచుకొండల మధ్య విభూది వినాయకుడు కొలువుదీరినట్టుగా ప్రతిమను తీర్చిదిద్దుతున్నారు. విగ్రహం తయారీ పనులను బాల వినాయక కమిటీ సభ్యులు దగ్గరుండి పర్యవేక్షిస్తుండగా చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement