– గతంలోనూ దొంగతనాలు,
గంజాయి కేసుల్లో నిందితురాలు
తిరుపతి: గంజాయిని తరలిస్తున్న ఓ మహిళను ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి 4.6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీకాం కళాశాల సమీపంలో గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడ నిఘా పెట్టి గంజాయితో పట్టుబడిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా, మంగసముద్రానికి చెందిన లక్ష్మీదేవి గంజాయి తరలిస్తూ పట్టుబడింది. ఆమైపె గతంలోనూ పలు దొంగతనాలు, గంజాయి కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఆయా కేసుల్లో అరైస్టె జైలు జీవితం గడిపినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితురాలిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్వీ యూనివర్సిటీ సీఐ నరేష్ తెలిపారు.
లారీ అదుపు తప్పి వ్యక్తి మృతి
ఓబులవారిపల్లె : చిన్నఓరంపాడు–ముక్కావారిపల్లి జాతీయ రహదారిపై శనివారం లారీ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ బీ.మురళి (50) అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్‌ఐ సుజున్‌కుమార్ కథనం మేరకు.. తాడిపత్రికి చెందిన లారీ డ్రైవర్ మురళి లోడ్డుతో చైన్నెకి బయల్దేరాడు. మార్గమధ్యంలోని చిన్న ఓరంపాడు వద్ద రోడ్డు మరమ్మతుల కారణంగా లారీ కల్వర్టు వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. విషయాన్ని గమనించిన డ్రైవర్ మురళి కుడివైపునకు దూకగా లారీ అతనిపైకే వెళ్లి పడింది. దీంతో మురళి అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు దర్యాప్తులో ఉంది.
వృద్ధురాలిపై దాడి చేసి.. బంగారు నగలు అపహరించి..
నాగలాపురం: పట్టపగలే గుర్తుతెలియని మహిళ ఓ వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి దాడి చేసి, బంగారు ఆభరణాలు అపహరించుకెళ్లిన ఘటన శనివారం మధ్యాహ్నం నాగలాపురం బజారు వీధిలో చోటుచేసుకుంది. బాధితురాలు ఉష (72) తెలపిన వివరాల ప్రకారం.. ఓ గుర్తుతెలియని మహిళ శనివారం ఉదయం నుంచి ఇంటికి ఎదురుగా ఉన్న కాయగూరల దుకాణం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తూ కనిపించింది. మధ్యాహ్నం సుమారు 2.30 గంటల సమయంలో ఉష ఇంట్లోకి వెళ్లిన వెంటనే ఆ మహిళ చొరబడి ఆమైపె దాడి చేసి మెడలో ఉన్న మూడు సవరల బంగారు చైను, చెవి కమ్మలు అపహరించుకొని పరారైంది. ఉష ఇంటి నుంచి బయటకు వచ్చి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సునీల్ తెలిపారు.
ఫ్రీ మెడికల్ చెకప్ పేరుతో చంపేశారు!
– ప్రెస్‌క్లబ్‌లో కుటుంబ సభ్యుల ఆరోపణ
తిరుపతి అన్నమయ్యసర్కిల్: ఫ్రి మెడికల్ చెకప్ పేరుతో రేణిగుంట బాలాజీ మెడికల్ కాలేజీ హాస్పిటల్ అండ్ రీసెర్స్ ఇన్‌స్టిట్యూట్ వారు తీసుకెళ్లి తమ తండ్రి ఆర్.గోవిందస్వామి (72)ని చంపేశారని కేవీబీపురం మండలం, రాజులకండ్రిగ గ్రామానికి చెందిన కుమారుడు గిరి, కుటుంబ సభ్యులు ఆరోపించారు. శనివారం సాయంత్రం వారు తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. గత నెల ఆగస్టు 10వ తేదీన రాజులకండ్రిగకు వచ్చిన హాస్పిటల్ సిబ్బంది ఉచిత వైద్య పరీక్షల పేరుతో ఆరోగ్యంగా ఉన్న తమ తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లారని చెప్పారు. ఆపై 13వ తేదీన మీ తండ్రి చనిపోయాడని కబురు వచ్చినట్టు పేర్కొన్నారు. మరణ ధ్రువీకరణ పత్రంలోనూ వేర్వేరు సమయాలు ఉండడం అనుమానాలకు తావిస్తోందన్నారు. తమ తండ్రి మృతిపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.


